ప్రజాశక్తి – ప్రత్తిపాడు : మద్యం నూతన విధానం నేపథ్యంలో కొత్తగా దుకాణాల ఏర్పాటుకు చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియను నియోజవకర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ నీరబ్‌కుమార్ గురువారం పరిశీలించారు. లాటరీ విధానం పారదర్శకంగా జరుగుతోందని, దరఖాస్తుదార్లకు ఇబ్బందులేమీ లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎవ్వరైనా, ఎక్కడి నుండైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. లైసెన్స్ ప్రక్రియ, వెబ్‌సైల్, నూతన మద్యం విధానంపై ప్రజలకు అవగాహన కోసం కార్యాలయం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 21 ఏళ్లు దాటిన ఎవ్వరైనా దరఖాస్తు చేసుకుని లాటరీలో పాల్గొనొచ్చని చెప్పారు. కార్యాలయంలో ప్రత్యేకంగా 3 కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం127 మద్యం షాపులు, పల్నాడు జిల్లాలో 129 మద్యం షాపులకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో చలానా కడితే ఆటోమేటిక్‌గా అప్లికేషన్ అప్లరు అవుతుందని, ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదని, ఫ్రెండ్లీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చని చెప్పారు. దరాఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత గుంటూరు జిల్లా వారికి గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కలెక్టర్ సమక్షంలో లాటరీ తీస్తారని చెప్పారు. పరిశీలనలో డీఎస్పీ మరియబాబు, సిఐ అశోక్ కుమార్, ఎస్‌ఐ రవీంద్రబాబు పాల్గొన్నారు.
