మద్యం దుకాణాలకు త్వరలో నోటిఫికేషన్‌

Oct 1,2024 00:29

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మద్యం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని సంబంధిత అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణబాబు ఆదేశించారు. దీనిపై జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఎక్సైజ్‌ అధికారులతో సోమవారం సమీక్షించారు. జిల్లాలో 129 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించబో తున్నామని, దరఖాస్తు చేసుకునేవారు ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో దరఖాస్తులు చేసుకోవచ్చునని చెప్పారు. గజిట్‌ వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ, లాటరీ విధానంపై కలెక్టర్‌కు ఎక్సైజ్‌ అధికారులు వివరించారు.
అదనపు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై అభిప్రాయం చెప్పండి
జిల్లాలో అదనపు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై అభిప్రాయాలు గురువారంలోగా చెప్పాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్‌ కోరారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సోమవారం సమావేశమయ్యారు. నరసరావుపేట నియోజకవర్గంలో 4 అదనపు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, 6 పోలింగ్‌ కేంద్రాల చిరునామాల మార్పు, చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒక అదనపు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు, 4 పోలింగ్‌ కేంద్రాల భవనాల మార్పు, ఒక పోలింగ్‌ కేంద్రం అడ్రస్‌ మార్పులకు సంబంధించి ప్రతిపాదనలను రాజకీయ పార్టీల ముందుంచి అభిప్రాయం కోరారు. 1500కు పైబడి ఓట్లున్న పోలింగ్‌ కేంద్రానికి అదనంగా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేరు వేరు పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదేశాలిచ్చామన్నారు. పలు పాఠశాలలు, భవనాల పేర్లు మారినందున వాస్తవంగా పోలింగ్‌ కేంద్రం అదే అయినా రికార్డుల్లో వాటి చిరునామాలు మార్చుకోవాల్సి వస్తోందన్నారు. సమావేశంలో నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్డీవోలు మధులత, రమణాకాంత్‌రెడ్డి, మురళీకృష్ణ, నియోజకవర్గాల ఈఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️