రైతుల గోడు వినండి

Mar 11,2025 00:26

ధర్నాలో రైతులు, నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
రాష్ట్రంలో ఈ ఏడాది అన్ని రకాల పంటలకు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని, కేవలం ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమాలతో సరిపెడుతోందని రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపుమేరకు గుంటూరులోని చుట్టుగుంట వద్ద గల రాష్ట్ర వ్యవసాయ కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభకు రైతుసంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు అధ్యక్షత వహించారు. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌ స్థాపించిన టిడిపి ఒకప్పుడు రైతుల తరుఫున పోరాడేదని, ఎన్‌టిఆర్‌ రైతుల కోసం కేంద్రంతో కొట్లాడేవారని, అయితే ఇప్పుడు సిఎం చంద్రబాబు రైతుల తరుఫున కేంద్రం వద్ద పోరాటమే చేయకుండా మోడీ చూసి నేర్చుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ చర్యలతో తెలుగు జాతి పరువు పోతుందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యంత ముఖ్యమైన గుంటూరు ఛానల్‌, వరికపూడిశెల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్లకు గోదావరి నీరు తెస్తాననడం శోచనీయమన్నారు. గోదావరి నీటిని నాగార్జున సాగర్‌ కుడిఎడమ కాల్వలకు వినియోగించి శ్రీశైలంకు వచ్చే 80 టిఎంసీల నీటిని పూర్తిగా రాయలసీమకు వినియోగించాలని సూచించారు. ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులను, గిరిజనులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పంటలకు మద్దతు ధరలను విస్మరించాయని విమర్శించారు. మతతత్వ విషయాలను తెరపైకి తీసుకువచ్చి ప్రజల జీవన విధానం అభివృద్ధికి ఏమాత్రమూ దృష్టి సారించడం లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధారణ ప్రజల అభ్యున్నతిని పట్టించుకోవడం లేదని, పి4 విధానం పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని చెప్పారు.

వేదికపై సమస్యలకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తున్న నాయకులు
రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ రైతుల వద్ద ఇప్పటికీ ధాన్యం నిల్వలున్నాయని, వీటిని కొనుగోలు చేయకుండా మంత్రి నాదెండ్ల మనోహర్‌ అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ఏడాది పత్తి, మిర్చితో పాటు అన్ని రకాల పంటలకు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాలపై దృష్టిపెట్టకుండా ఇతర అంశాలపైనే ప్రజలు మభ్య పెడుతున్నారని అన్నారు. మరోవైపు ఇతర దేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు. మిర్చి రైతులను ఆదుకోవాలంటే క్వింటాళ్‌కు రూ.11,781 కన్నా ధర తగ్గితే ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మిర్చి క్వింటాళ్‌కు రూ.20 వేలు ఇచ్చినా గిట్టుబాటు కాదన్నారు. వై.కేశవరావు మాట్లాడుతూ పంటలకు మద్దతు ధర లేకుంటే కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్‌ వెన్షన్‌ పథకం ద్వారా రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో కూడా రూ.300 కోట్లు మాత్రమే ధరల స్థిరీకరణ నిధిని కేటాయించారని తెలిపారు. కోకో రైతు సంఘం నాయకులు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 29 ఏళ్లయినా ఇంతవరకు పూర్తి కాలేదని, రాయలసీమలో హంద్రీనీవా గాలేరు నగరి తదితర కీలకమైన ప్రాజెక్టులను ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఎపి రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య మాట్లాడుతూ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు దోచిపేట్టేందుకు, కూటమి నాయకులకు కమీషన్లు దక్కించుకునేందుకు అని ఎద్దేవా చేశారు. పొగాకు రైతుసంఘం నాయకులు చుండూరు రంగారావు మాట్లాడుతూ మద్దతు ధరల కోసం రైతులు ఉద్యమించాలన్నారు. దేశంలో రాష్ట్ర రైతుల తలసరి ఆదాయం చివరి నుంచి రెండో స్థానంలో ఉందన్నారు. ప్రకృతికి విరుద్ధంగా పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలతో పశువులు, పక్షులతో పాటు మానవ మనుగడకే ముప్పు పొంచి ఉందని చెప్పారు. రైతులకు పెట్టుబడులు పెరుగుతుండగా మరోవైపు దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. నల్లమడ రైతుసంఘం నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌రావు మాట్లాడుతూ బర్లీ పొగాకు పండించాలని రైతులకు సలహాలిచ్చే ఐటిసి ఇప్పుడు మొఖం చాటేస్తోందని, బర్లీ పొగాకుతో తమకు సంబంధం లేదని పొగాకు బోర్డు అధికారులంటున్నారని విమర్శించారు. ఐటిసి సిఈవో జీతం ఏడాదికి రూ.22 కోట్లు కాగా రైతుల ఆదాయం నెలకు రూ.13 వేలు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతుసంఘం ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, వివిధ రైతు సంఘాల నాయకులు సి.హెచ్‌. వెంకటేశ్వర్లు, చుండూరు రంగారావు, వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు, పి.జమలయ్య, వెంకటరెడ్డి, ఆంజనేయులు, ఎం.సూర్యనారాయణ. హనుమారెడ్డి, ముసలయ్య, వివిధ రైతు సంఘాల జిల్లా నాయకులు కంచుమాటి అజరు కుమార్‌, ఉల్లిగడ్డ నాగేశ్వరావు, పచ్చల శివాజీ, వేల్పూరి నరసింహారావు, కొల్లి రంగారెడ్డి, ఈమని అప్పారావు, బైరగాని శ్రీనివాసరావు, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ చిష్టి, మెడికల్‌ యూనియన్‌ నాయకులు రాష్ట్ర నాయకులు కుమార్‌, సలీం ప్రసంగించారు. ఈ సందర్భంగా అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ సునీతకు రైతు సంఘాల నాయకులు సోమవారం సాయంత్రం గుంటూరులో వినతిపత్రాలు అందించారు. రైతుల సమస్యలపై ప్రజానాట్య మండలి కళాకారులు పలు గీతాలను ఆలపించారు.

రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ సునీతకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

➡️