ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లా అభివృద్ధి సాధనలో ప్రధాన అడ్డంకిగా వున్న నిరక్షరాస్యతను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నవభారత్ సాక్షరత కార్యక్రమం గొప్ప అవకాశమని, దీనిని విజయవంతం చేసేందుకు మండలస్థాయిలో అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యులైన 48,578 మంది స్వయంశక్తి మహిళలను అక్షరాస్యులుగా రూపొందించి జిల్లాను వచ్చే ఆరు నెలల కాలంలో సంపూర్ణ అక్షరాస్యత దిశగా నడిపించాలని సూచించారు. నవభారత్ సాక్షరత కార్యక్రమంపై వయోజన విద్యాశాఖ రూపొందించిన పోస్టర్లను, శిక్షణకు ఉద్దేశించిన పుస్తకాలను కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఎంపిడిఒలు వ్యక్తిగత శ్రద్ధ చూపించాలన్నారు. డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి మాట్లాడుతూ నిరక్షరాస్యత అనే సామాజిక రుగ్మతను తొలగించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎంపిడిఒలు, వెలుగు ఎపిఎంలను కోరారు. స్వయంశక్తి సంఘాల్లో విద్యావంతులైన మహిళలను గుర్తించి వారి ద్వారా ఒక్కో మహిళ మరో పది మందికి చదువు నేర్పేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మండల స్థాయిలో ఎంపిడిఒ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీలో ఎపిఎం, సిడిపిఒ తదితరులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు ఎ.సోమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు 2024 నుంచి 2027 వరకు నవభారత్ సాక్షరత కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలో ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులైన స్వయంశక్తి మహిళలు, మధ్యాహ్న భోజన పథకం వంటపనివారు, ఆయాలు, హెల్పర్లు, నైట్ వాచ్‌మెన్‌లు, అంగన్‌వాడీ హెల్పర్లు, పారిశుద్ధ్య కార్మికులను అక్షరాస్యులుగా రూపొందించా లన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వీరందరికీ ప్రాథమిక అక్షరాస్యత, ఆర్ధిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, క్రియాత్మక అక్షరాస్యతలపై అవగాహన కలిపిస్తామన్నారు. ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో రెండు గంటల సమయాన్ని నిరక్షరాస్యులకు చదువు చెప్పేందుకు వలంటీర్లు కేటాయించాల్సి వుంటుందన్నారు. శిక్షణకు అవసరమైన పుస్తకాలు, బోధన సామాగ్రిని అందజేస్తామన్నారు. జెడ్‌పి సిఇఒ సత్యనారాయణ మాట్లడుతూ జిల్లా అభివృద్ధిలో అక్షరాస్యత ఎంతో కీలకమని పేర్కొన్నారు. వయోజనుల్లో విద్య పట్ల ఆసక్తి కలిగించడం ముఖ్యమని చెప్పారు. డిపిఒ టి.వెంకటేశ్వరరావు, జెడ్‌పి డిప్యూటీ సిఇఒ వెంకటరామన్, ఐసిడిఎస్ పీడీ శాంతకుమారి, డిపిఆర్‌ఒ డి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.