లిథియం అయాన్‌ బ్యాటరీల స్థానే స్వదేశీ పరిజ్ఞానం

Gitam Lithiyam ayan battery meeting

ప్రజాశక్తి -మధురవాడ : విద్యుత్తు వాహనాలు పనిచేయాలంటే దీర్ఘకాలం మన్నే లిథియం అయాన్‌ బ్యాటరీల అవసరం ఉందని, వీటి కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చి సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జి అండ్‌ న్యూమెటీరియల్స్‌ (ఎఆర్‌సిఐ) మాజీ డైరక్టర్‌, ఐఐటి హైదరాబాద్‌ రీసెర్చి సలహదారు డాక్టర్‌ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ రసాయన శాస్త్ర విభాగంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2030 సంవత్సరం నాటికి దేశంలో 30 శాతం విద్యుత్తు వాహనాలు ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, వీటి తయారీకి విద్యుత్తును అధికంగా నిల్వ చేసుకునే సామర్ధ్యం గల లిథియం అయాన్‌ బ్యాటరీలు అవసరమని చెప్పారు. దేశంలో ఈ బ్యాటరీల తయారీ పరిజ్ఞానం అంతగా లేకపోవడంతో దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. నూతన పదార్థ విజ్ఞానాన్ని ఉపయోగించి టెస్లా కంపెనీ ఎన్‌ఎమ్‌సి బ్యాటరీలను రూపొందించిందని, భారతదేశ వాతావరణ పరిస్థితులకు అవి సరిపోవని నిర్ధారించినట్లు వివరించారు. లిథియం అయాన్‌ బ్యాటరీలలో ఉపయోగించే పదార్ధం ఖరీదు అధికంగా ఉండటంతో చైనా వంటి దేశాలలో ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై దృష్టి సారించారని తెలిపారు. భారతీయ పరిశోధకులు ప్రత్యామ్నాయ బ్యాటరీల తయారీలో విజయం సాధించారని వెల్లడిరచారు. భారతీయ వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా ఎల్‌ఎఫ్‌పి బ్యాటరీల పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చి సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జి అండ్‌ న్యూమెటీరియల్స్‌ (ఎఆర్‌సిఐ) లో రూపొందించి ఇటీవల పలు పరిశ్రమలకు అందజేసినట్లు పేర్కొన్నారు. త్వరలో దేశంలో తయారయ్యే విద్యుత్తు వాహనాలలో ఈ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన బ్యాటరీలను ఉపయోగించనున్నారని తెలిపారు. బ్యాటరీల జీవిత కాలం పూర్తి అయిన అనంతరం రీసైక్లింగ్‌పై పరిశోధకులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కెఎస్‌.కృష్ణ, ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కె.వేదవతి, రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎన్‌విఎస్‌.వేణుగోపాల్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️