జులుంతో దెబ్బతింటున్న జీవనోపాధి

May 16,2024 23:54

కలెక్టర్‌, ఎస్పీకి వినతిపత్రం ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో 4 సమస్యాత్మక నియోజకవర్గాలను ప్రకటించిన ఎన్నికల కమిషన్‌, పోలీసు శాఖ ఆయా నియోజకవర్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఘర్షణలను నివారించడంలో పోలీస్‌శాఖ విఫలమైందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ అన్నారు. ఈ మేరకు నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఎస్‌పి జి.బిందుమాధవ్‌, జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలిసి విన్నవించారు. జిల్లాలో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని కోరారు. 144 సెక్షన్‌ అమలు పేరిట చిరువ్యాపారులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని, ఇది వారి జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆందోళన వెలిబుచ్చారు. 144 సెక్షన్‌ ఎన్ని రోజులు అమలులో ఉంటేందో ప్రకటించలేదని, దీనివల్ల కూరగాయలు, పండ్ల వ్యాపారుస్తులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. మరోవైపు మద్యం దుకాణాలను మాత్రం మూయించడం లేదని అన్నారు. ఘర్షణల నివారణకు 144 సెక్షన్‌ అమలు పరిష్కారం కాదని, ఇరు పార్టీల రాజకీయ నేతలను, నేర చరిత్ర కలిగి వారిని అదుపులోకి తీసుకోవాలని కోరారు. బెట్టింగుల నియంత్రణపై దృష్టిపెట్టాలని, ఘర్షణలకు కారకులపై కేసులు నమోదు చేయాలని కోరారు. 144 సెక్షన్‌ కొనసాగితే నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉందనే అంశాన్నీ గుర్తించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో వివిధ సంఘాల నాయకులు కె.రామారావు, ఎస్‌.ఆంజనేయ నాయక్‌, ఎస్‌.దుర్గాబాయి, డి.శివకుమారి, హుస్సేన్‌, రబ్బాని, సిలార్‌ మసూద్‌, ఇ.మస్తాన్‌రెడ్డి, సుభాష్‌ చంద్రబోస్‌, అంజిరెడ్డి ఉన్నారు.

➡️