పక్కాగా పశుగణన నిర్వహించాలి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ఐదేళ్ల తర్వాత పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పశుగణన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వారి పరిధిలో పక్కాగా నిర్వహించి లెక్కలు తేల్చాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి గుణశేఖర్‌ పిళ్లై ఉపసంచాలకులు విజయభాస్కర్‌ తెలిపారు. మంగళవారం రాజంపేట ఎంపిడిఒ కార్యాలయ సభావనంలో రాజంపేట, రైల్వేకోడూరు నియోజవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించిన పశువైద్యాధికారులు, ఎన్యూమరేటర్లకు పశుగణనపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి పశుగణనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్‌ మాట్లాడుతూ 2019లో 20వ పశుగణన జరిగిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకు పశుగణన చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. పశు వైద్యాధికారులు, సిబ్బంది అందరూ వారి వారి పరిధిలోని ఇళ్లను సందర్శించి పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, పెరటి కోళ్ల, పాలిచ్చే పశువులు, కుక్కలు, పెంపుడు కుక్కలు దాదాపు 15 అంశాలపై సమగ్ర వివరాలు సేకరించాలన్నారు. తద్వారా పాలు, గుడ్లు, మాంసం, ఇతరత్రా దిగుబడి ఎంత ఉందనేది ఈ గణాంకల ద్వారా తెలుస్తోందని చెప్పారు. సచివాలయాల్లోని పశుసంవర్ధక సహాయకులు కూడా ఈ సర్వేలో పాల్గొని పశుగణ చేపట్టాలని తెలిపారు. అఖిల భారత పశుగణన పక్కగా నిర్వహించేందుకు ఘన కులపు శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తామని వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ రాజంపేట సహాయ సంచాలకులు ప్రతాప్‌, రైల్వేకోడూరు సహాయ సంచాలకులు సురేష్‌ రాజులతోపాటు ఏడు మండలాలకు చెందిన పశువైద్య శాఖ అధికారులు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.

➡️