విభిన్న ప్రతిభావంతులకు రుణాలు

Dec 6,2024 21:52

 ప్రజాశక్తి-విజయనగరంకోట :  విభిన్న ప్రతిభావంతులకు ఉపాధి కల్పించేందుకు రుణాలు మంజూరు చేస్తున్నామని జిల్లా విభిన్న ప్రతిభా వంతులు, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు జివిడి జగదీష్‌ చెప్పారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమం ఆనంద గజపతి ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎడి మాట్లాడుతూ తమ శాఖ పరంగా వికలాంగుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని, విభిన్న ప్రతిభావంతులు ఉపాధి పొందాలని కోరారు. మెప్మా పీడీ చిట్టి రాజు మాట్లాడుతూ దివ్యాంగులు అందరికీ ఆదర్శంగా ఉంటూ వివిధ రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. వారికి శాఖా పరంగా ఇస్తున్న రుణాల గురించి తెలిపారు. రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ కెఆర్‌డి ప్రసాద్‌ మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతుల్లో నాయకత్వ లక్షణాలు వెలికితీయడం, ఈ సంవత్సరం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ థీమ్‌ అని పేర్కొన్నారు. మానసిక వికలాంగులను వారి వారి పనులు చేసుకునేలా తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వారికి ల్యాప్‌టాప్‌లు, టచ్‌ ఫోన్లు అందజేశారు. వివిధ రంగాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులకు, విభిన్న ప్రతిభావంతులకు సహాయం చేసిన వారికి సన్మానించారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. సాంస్కతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రభుత్వ అంథుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌ రెడ్డి, ఒహెచ్‌ అసోసియేషన్‌ నాయకులు లక్ష్మణరావు, అంథ ఉద్యోగుల సంఘం నాయకులు ఉమా శంకర్‌, డెఫ్‌ అసోసియేషన్‌ టి సూర్యనారాయణ, నామినేటెడ్‌ సభ్యులు జి.లలిత తదితరులు మాట్లాడారు. వివిధ అసోసియేషన్లు, ఎన్‌జిఒలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️