ప్రభుత్వ అనుమతితోనే లాకౌట్‌

Mar 14,2025 00:16

100వ రోజు దీక్షను ప్రారంభిస్తున్న ప్రభాకర్‌రెడ్డి
ప్రజాశక్తి- తాడేపల్లి :
ప్రభుత్వ అనుమతితోనే ఎసిసి సిమెంట్‌ ఫ్యాక్టరీ 35 ఏళ్ల క్రితం అక్రమ లాక్‌ అవుట్‌ గురైందని, ప్రభుత్వమే బాధ్యత వహించి కార్మికులకు రావాల్సిన నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నష్టపరిహారం కోసం ఎసిసి సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులు చేస్తున్న దీక్షలు గురువారం 100 రోజులకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని ప్రభాకర్‌రెడ్డితో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ప్రారంభించారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో పెద్దలకు సిఎం వేలాది ఎకరాలు కట్టబెడుతున్నారని, కర్నూలు జిల్లాలో ఆదోని దగ్గర, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీలకు సోలార్‌ ఎనర్జీ పేరుతో ఐదు లక్షల ఎకరాలు కట్టబెడుతున్నారని అన్నారు. రైతులను భూముల నుండి వెళ్లగొట్టటానికి ప్రభుత్వం యత్నిస్తోందని దుయ్యబట్టారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని, గత కోర్టు తీర్పులు అమలు బాధ్యతా ప్రభుత్వం దేనని స్పష్టం చేశారు. గత వైసిపి ప్రభుత్వం రాజధానిలో ఇచ్చిన స్థలాలను రద్దుచేసి వారి వారి స్వస్థలాలు ఇంటి స్థలాలు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఇక్కడ నివాసం ఉంటున్న సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులకు ఎందుకు స్థలం ఇవ్వటం లేదని ప్రశ్నించారు. నేతాజీ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి నారా లోకేష్‌ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో ఓట్ల అభ్యర్థిస్తూ తనను గెలిపిస్తే సిమెంట్‌ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తమ బాధలు చెప్పుకోవటానికి కార్మికులు వెళ్తే బయటికి గెంటేసి గేట్లు వేస్తానని బెదిరించడం ఏమిటన్నారు. హైదరాబాదులోనే సెంట్రల్‌ లేబర్‌ ట్రిబ్యునల్‌ కోర్ట్‌, హైకోర్టు ఆర్డర్‌ ఇచ్చి, కార్మికులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చిందంటే, అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. తాడేపల్లి మంగళగిరి ప్రాంతంలో సుమారు 20 వేల మంది ఇళ్ల స్థలాలు లేని వారున్న సంగతిని గుర్తు చేశారు. ఫ్యాక్టరీ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులకు నష్టపరిహారం ఇవ్వగా, మిగిలిన భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యలను పట్టించుకోకుంటే ప్రభుత్వానికి నష్టం తప్పదన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్‌రావు, సిపిఎం సీనియర్‌ నాయకులు డి.వెంకటరెడ్డి, సిపిఎం రూరల్‌ కార్యదర్శి పి.కృష్ణ మాట్లాడుతూ వందరోజులపాటు దీక్షలు పూర్తి చేసుకున్న ముఖ్యంగా మహిళలకు అభినందనలు తెలిపారు. కార్మికుల్లో చీలికలు లేవటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అప్రమత్తంగా ఉండి తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు మాట్లాడుతూ సిమెంట్‌ ఫ్యాక్టరీ అక్రమ లాకౌట్‌ కాదని మంత్రి లోకేష్‌ ప్రకటించడం దుర్మార్గమన్నారు. 300 కుటుంబాలతో ముడిపడిన సమస్యను మంత్రి చులకన చేసి మాట్లాడుతున్నారని, తాడోపేడో తేల్చుకోటానికి కార్మికుల సిద్ధం కావాలని అన్నారు. ఎఐఎఫ్‌టియు నాయకులు కె.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ టియు నాయకులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంపై కార్మికుల పెట్టుకున్న ఆశలు అడియాస లేయని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు. వైసిపి నాయకులు డి.రమేష్‌, సిహెచ్‌ సుబ్బారావు, సిహెచ్‌.మల్లేశ్వరరావు, యూనియన్‌ నాయకులు కూరపాటి స్టీవెన్‌ పాల్గొన్నారు.

➡️