ప్రజాశక్తి-మార్కాపురం : జాతీయ లోక్ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.బాలాజీ కోరారు. లోక్ అదాలత్‌లో కేసులు భారం తగ్గించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించి రాజీ మార్గాలు కుదిరించాలని సూచించారు. స్థానిక అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు హాలులో జాతీయ లోక్ అదాలత్‌పై పోలీసు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి బాలాజీ మాట్లాడుతూ కేసులతో కక్షిదారులు సమయం వృథాతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. రాజీ మార్గంతో కక్షిదారులు కూడా స్నేహితులుగా మారే అవకాశం ఉంటుందన్నారు. సమాజంలో అందరూ సహాయ సహకారాలతో మెలగాలన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా విజయవంతం అయ్యేలా చూడాలని పోలీసులకు సూచించారు. అనంతరం మార్కాపురం సబ్ జైలును జడ్జి బాలాజీ సందర్శించారు. అక్కడ ముద్దాయిల బాగోగులు, ఆహారం, పరిశుభ్రతపై ఆరా తీశారు. సబ్ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావును వివరాలు అడిగారు. అవకాశం ఉన్న వారికి బెయిల్ మంజూరు చేయడంపై ఇరువరూ చర్చించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సహాయ సేవకులు షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు.
