జోరుగా అభ్యర్థుల నామినేషన్లు

Apr 23,2024 00:26

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్‌ దాఖలు చేస్తున్న వైసిపి అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సోమవారం పెద్దసంఖ్యలోనామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులంతా తమ ప్రాంతాల్లో భారీగా ర్యాలీలు నిర్వహించారు. రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. గుంటూరు జిల్లాలో 37 నామినేషన్ల దాఖలు చేయగా పల్నాడుజిల్లాలో 38నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్లు దాఖలుకు ఈనెల 25న చివరితేదీ కావడంతో ఇప్పటి వరకు ప్రధానపార్టీల అభ్యర్థులు ఎక్కువ మంది నామినేషన్లు సమర్పించారు. అభ్యర్థులంతా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పట్టణాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. ఇండియా బ్లాక్‌ తరుఫున మంగళగిరి నుంచి సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్‌రావు, గుంటూరు తూర్పు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మస్తాన్‌వలి నామినేషన్లు దాఖలు చేశారు.

పల్నాడు జిల్లా గురజాలలో ర్యాలీగా వెళ్తున్న టిడిపి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు
కాంగ్రెస్‌ నుంచి వై.రామచంద్రారెడ్డి (మాచర్ల), జక్కా రవీంద్రనాథ్‌ (పొన్నూరు), పమిడినాగేశ్వరరావు (పెదకూరపాడు) నామినేషన్లు సమర్పించారు. గుంటూరు లోక్‌సభ టిడిపి అభ్యర్తిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ తన కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. టిడిపి నుంచి పల్నాడు జిల్లా గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి వచ్చినామినేషన్లు వేశారు. యరపతినేని ర్యాలీకి భారీగా ప్రజలు తరలి వచ్చారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు పశ్చిమలో గల్లా మాధవి, నశీర్‌ అహ్మద్‌, ప్రత్తిపాడులో బి.రామాంజనేయులు భారీ ప్రదర్శనలతో తరలి వచ్చారు. వైసిపి అభ్యర్థులుగా బలసాని కిరణ్‌కుమార్‌ (ప్రత్తిపాడు), మేకతోటి సుచరిత (తాడికొండ), అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), కావటి మనోహర్‌ నాయుడు (చిలకలూరిపేట), బొల్లా బ్రహ్మనాయుడు (వినుకొండ), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), నంబూరు శంకరరావు (పెదకూరపాడు) తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. తెనాలి నుంచి ముస్లిం లీగ్‌ అభ్యర్థిగా పఠాన్‌ గఫార్‌ ఖాన్‌, పెదకూరపాడు ఇండియన్‌ ముస్లిం లీగ్‌ నుంచి షేక్‌ యూనస్‌, బిఎస్‌పి తరుఫున సంగం శ్రీకాంత్‌రెడ్డి (నరసరావుపేట), నల్లపు కోటేశ్వరరావు (చిలకలూరిపేట) తదితరులు నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. నర్సరావుపేటనుంచి జి.రమేష్‌కుమార్‌ (జాతీయ జనసేన పార్టీ), టి.నాగరాజు (ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌), పి.సాంబశివరావు (నవరంగ్‌ కాంగ్రెస్‌) నామినేషన్లు వేయగా పల్నాడు జిల్లాలో 9 మంది ఇండిపెండెంట్‌లు నామినేషన్‌ దాఖలు చేశారు. బుధ, గురువారాల్లో నామినేషన్లు ఎక్కువగా దాఖలు చేసే అవకాశం ఉంది.

➡️