టిడిపికి విధేయుడుగా ఉంటూ..

Jun 8,2024 20:36

ప్రజాశక్తి- బొబ్బిలి, బాడంగి:  టిడిపికి విధేయుడుగా ఉంటూ బొబ్బిలి నియోజకవర్గంలో బేబినాయన గెలుపునకు పని చేసిన నిశ్వార్థ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా. వైసిపిలో చేరితే ఎమ్మెల్యేగా గెలిపిస్తామని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ తాను టిడిపిలోనే కొనసాగుతానని నిర్మొహమాటంగా చెప్పి టిడిపిలో కొనసాగుతూ మంచి వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నారు. తనకు పదవులు కన్నా టిడిపి ముఖ్యం అంటూ టిడిపికి విధేయుడుగా ఉంటూ పని చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలోకి తీసుకు వెళ్తామని ఎన్నికల ముందు బాడంగి మండలంలో జరిగిన బిసి గర్జన సభలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ప్రకటించారు. తండ్రి మరణంతో రాజకీయ రంగప్రవేశంతెంటు రాజా తండ్రి తెంటు జయప్రకాష్‌ మరణం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెర్లాం నియోజకవర్గం నుంచి ఏడు సార్లు టిడిపి నుంచి పోటి చేసిన ఆయన తండ్రి ఆరుసార్లు విజయం సాధించి ఎమ్మెల్యేగా పని చేశారు. 2008 జనవరి 6న ఎమ్మెల్యేగా పని చేస్తూ తెంటు జయప్రకాష్‌ అనారోగ్యంతో మరణించారు. తండ్రి మరణంతో రాజకీయ రంగప్రవేశం చేసిన తెంటు రాజా 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా పని చేశారు. 2009 ఎన్నికల్లో తెర్లాం నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గంలో విలీనం కావడంతో 2009, 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2017లో బొబ్బిలి రాజులు టిడిపిలో చేరడంతో 2019 ఎన్నికల్లో టిడిపి టికెట్‌ సుజయకృష్ణ రంగారావుకు, 2024 ఎన్నికల్లో బేబినాయనకు కేటాయించారు. రెండు సార్లు ఆయనకు టిక్కెట్టు ఇవ్వకపోయినా టిడిపికి విధేయుడుగా ఉంటూ గెలుపునకు పని చేశారు. రెండు సార్లు టికెట్‌ ఇవ్వకపోయిన పార్టీలో ఉంటూ టిడిపి బలోపేతానికి పని చేయడంతో తెంటు రాజాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని నారా లోకేష్‌ హామీ ఇచ్చి బాడంగి బిసి గర్జన సభలో ప్రకటించారు. టిడిపి అధికారంలోకి రావడంతో తెంటు రాజాకు ఎమ్మెల్సీ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని టిడిపి కార్యకర్తలు కోరుతున్నారు.2019లో వైసిపిలో చేరితే..2019 ఎన్నికలకు ముందు తెంటు రాజాను వైసిపిలో చేరాలని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. వైసిపిలో చేరితే 2019 ఎన్నికల్లో గెలిపించి ఎమ్మెల్యేను చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ వైసిపిలో చేరేందుకు తెంటు రాజా అంగీకరించలేదు. అప్పటిలో వైసిపిలో చేరితే ఎమ్మెల్యేగా విజయం సాధించే వారని చర్చ ఉంది. 2024 ఎన్నికల్లో కూడా బొబ్బిలి నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థిని పోటీలో పెట్టేందుకు తెంటు రాజాను వైసిపిలో చేరాలని కోరినప్పటికీ చేరేందుకు ఆసక్తి చూపలేదని చర్చ ఉంది. టిడిపిని స్థాపించినప్పటి నుంచి తండ్రి తెంటు జయప్రకాష్‌ టిడిపిలోనే ఉండడంతో తాను కూడా ఎటువంటి పదవులతో సంబంధం లేకుండా టిడిపిలో ఉంటానని చెప్పి కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్ది బేబినాయన గెలుపునకు సాయశక్తులా పని చేశారు. రాజా సహాయం మరువలేనిదని బేబినాయన కూడా ప్రకటించారు. టిడిపి అధిష్టానం తెంటు రాజా సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నియోజకవర్గ కార్యకర్తలు కోరుతున్నారు.

➡️