పశువుల్లో లంపి స్కిన్‌ వ్యాప్తి

Dec 13,2024 00:06

ప్రజాశక్తి-ముప్పాళ్ల : దేశాన్ని కుదిపేస్తున్న లంపి స్కిన్‌ వ్యాధి మండలంలోని పలు గ్రామాల్లోనూ విస్తరిస్తూ తెల్ల పశువులను బలి తీసుకుంటోంది. మండలంలో 50కి పైగా ఆవులు, ఎద్దులు, ఆవు దూడలు ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. వ్యాధి బారిన పడి పశువులకు వేల రూపాయలు ఖర్చు చేసి మందులు తెచ్చి వాడినా ప్రయోజనం లేకపోగా రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతున్నాయి. వ్యాధి బారిన పడిన పశువులకు ఒంటిమీద దద్దుర్లు, వాపులతో పెద్ద పెద్ద పుండ్లు ఏర్పడుతున్నాయి. వాటి నుండి చీముతో కూడిన రక్తం కారుతోంది. ఈ వ్యాధికి వ్యాక్సి న్‌ను ఇంకా కనుగొనకున్నా గొర్రెలు, మేకలలో కనబడే గౌట్‌ పాక్స్‌ వ్యాధి మాదిరిగానే ఉందని పశు సంవర్థక శాఖ అధికారులు ఇదే వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. అయినా వ్యాధి కట్టడి అవ్వకపోగా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పశుపోషకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రైతులు పశుపోషణతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. లంపిస్కిన్‌ వ్యాధి వల్ల తమ పశువులకు ఎమవుతుందోనని, తమ ఆర్థిక పరిస్థితి మరింతగా కుదేలవుతుందని పాడిరై తులు కంగారు పడుతున్నారు. దీనిపై మాదల పశువైద్యులు డాక్టర్‌ పుల్లారెడ్డిని వివరణ కోరగా మండలంలో తక్కువ సంఖ్యలోనే లంపి స్కిన్‌ వ్యాధి సోకిన పశువులు ఉన్నాయని చెప్పారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న దూడలకు వ్యాధి తీవ్రత ఉందన్నారు. పాడి రైతులు తమ పశువుల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంలూ దోమల బెడదను నివారిస్తే ఒకదాని నుండి మరోక పశువుకు వ్యాధి వ్యాపించకుండా నివారించొచ్చని అన్నారు.

➡️