ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : త్వరలో మచిలీపట్నం మున్సిపల్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పున ప్రారంభి పూర్తి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.ఆదివారం ఆయన నగర కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో పాత రైల్వే స్టేషన్ ఎదురుగా నిర్మాణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1864లో మచిలీపట్నం మున్సిపాలిటీ ఏర్పాటయిందన్నారు. తర్వాత మచిలీపట్నం నగర కార్పొరేషన్ గా మార్పు చెందిన తరుణంలో 2016లో ఈ ప్రాంతంలో నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పునాదుల స్థాయి వరకు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదన్నారు. ఆ పనులను తిరిగి పున ప్రారంభించేందుకు అంచనాలు తయారు చేయాలని ఇప్పటికే మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు.అదేవిధంగా మచిలీపట్నం నగర పరిధిలో ఉన్న మున్సిపాలిటీకి చెందిన భూములను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామి పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించామన్నారు. దానిలో భాగంగా బేబీ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, పాత కూరగాయలు మార్కెట్, బళ్ళదొడ్డి వంటి వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా చారిత్రాత్మక ప్రాంతమైన కోనేరు సెంటర్ ను వ్యాపారస్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు డి పి ఆర్ ను రూపొందిస్తున్నామని, త్వరితగతిన ఈ ప్రణాళికను ముందుకు తీసుకు వెళ్ళేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ సహకారంతో ఒక ప్రత్యేకమైన టీమును ఏర్పాటు చేస్తున్నామన్నారు. మచిలీపట్నం నగరాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.మంత్రి వెంట కూటమి నాయకులు బండి రామకృష్ణ, కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నం మున్సిపల్ నూతన కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర
