మాధవికి మంత్రి పదవి?

Jun 10,2024 21:14

ప్రజాశక్తి- నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తరువాత మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాల్లో అన్ని చోట్లా కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. వీరిలో ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలే ఉన్నారు. గెలిచిన వారిలో సీనియర్లతో పాటు మొదటిసారి విజయం సాధించిన జూనియర్లు కూడా ఉన్నారు. దీంతో సీనియర్లు కాబట్టి తమకే మంత్రి పదవి వస్తుందని కొంత మంది చెప్పగా లేదు కూటమి కొత్తదనానికి అవకాశం ఇస్తుందని మరికొంత మంది ఆశావాహులు తమ అనునాయులు వద్ద చెపుకుంటున్నట్లు తెలిస్తోంది. దీంతో జిల్లాలో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే లోకం నాగమాధవి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. జనసేన కోటాలో ఆమెకు విజయనగరం జిల్లా నుంచి తప్పనిసరిగా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలో కూటమి విజయం సాధించడంతో ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారం రోజునే కేబినెట్‌ మినిష్టర్లు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఎవరికి మంత్రి పదవి వస్తుందోనని గత వారం రోజులుగా చర్చ జరుగుతోంది. కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జనసేకు ఎన్ని మంత్రి పదువులు వస్తాయన్న దానిపైనా చర్చ జరుగుతోంది. కాగా సమయం దగ్గర పడటంతో జనసేనకు కనీసం నాలుగు నుంచి ఐదు, బిజెపికి ఒకటి మిగితా పదవులు టిడిపి నాయకులకు ఇస్తారని ప్రచారం జోరందుకుంది. దీన్ని బలపరుస్తూ సోమవారం ఢిల్లీలో పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసి మంత్రి పదవులపై చర్చించినట్లు తెలిస్తోంది. ఇందులో భాగంగా పవన్‌ను కేబినెట్‌లోకి రావాలని చంద్రబాబు ఆహ్వానించినట్లు, దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిస్తోంది. దీంతో జనసేనకు వచ్చే ఐదులో ఒకటి దాదాపు ఖరారు కాగా మిగిలిన నాలుగు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటి చేసి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఒకే ఒక మహిళా నాయకులు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఉన్నారు. జనసేనకు కేటాయించిన పదువుల్లో మహిళాగా గౌరవించి ఆమెకు తప్పనిసరిగా మహిళా కోటాలో మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను విజయవాడకు పార్టీ ఆహ్వానించినట్లు తెలిస్తోంది. దీంతో ఆమె సోమవారం హాడావుడిగా విజయవాడకు బయలుదేరారు. ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని జనసైనికులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఆ పార్టీ నుంచి లోకం నాగమాధవి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్లును పార్టీ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే పోటి చేసి విజయం సాధించిన తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్న మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జిల్లాల పునర్విభజన తరువాత విజయనగరం జిల్లాకు తొలి మహిళా మంత్రిగా కూడా రికార్డు నెలకొల్పే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

➡️