మహా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని తేనెలొలికే అచ్చమైన తెలుగులో రచించిన ఖ్యాతి మహా కవయిత్రి మొల్లమాంబకే దక్కుతుందని బీసీ సంక్షేమ సేవా సంఘం పేర్కొంది. గురువారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యర్రగొండ పాలెం పట్టణంలోని అంబేద్కర్‌ బొమ్మ సెంటర్‌లో మహా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నిఇవాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ తొలి తెలుగు రచయిత్రిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మొల్ల పదిలపరు చుకుందని తెలిపారు. రామాయణాన్ని మహా పండితులు అనేక మంది రచించినప్పటికీ మొల్ల రామాయణానిది విశిష్ట స్థానమని తెలిపారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్‌ అమీర్‌బాషా, బీసీ సంక్షేమ సంఘం నాయకులు సిహెచ్‌ చెన్నయ్య, కృష్ణగౌడ్‌, షేక్‌ వలీసాహెబ్‌, ఇస్మాయిల్‌, బట్టపోతుల వెంకటేశ్వర్లు, బంగ్లా సుబ్బయ్య, ముటుకూరు వెంకటేశ్వర్లు, మారపాకుల రాంబాబు, పోకూరి సుబ్రహ్మణ్యం, వరికళ్ళు పోలయ్య, పోతుగంటి నారాయణ, తెల్ల నరసింహులు, గోపాలకృష్ణ, చల్లా వెంకటేశ్వర్లు, ఎడవల్లి వెంకట నరసయ్య, పాలూరి గురుమూర్తి, గాజుల పల్లి పెద్ద పాలంకయ్య, పాలూరు వెంకట నారాయణ, లింగాల పెద్దచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
గిద్దలూరు: మొల్ల జీవితం మహిళా లోకానికి ఆదర్శమని, రామాయణాన్ని సరళ భాషలోకి అనువదించిన ఘనత ఆమెకే దక్కుతుందని గ్రంథపాలకురాలు ప్రసన్నకుమారి అన్నారు. గురువారం పట్టణంలోని గ్రంథాలయంలో గ్రంథపాలకురాలు ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విశాంత్ర ఉపాధ్యాయులు బి రామిరెడ్డి, శాలివాహన సంఘ నాయకులు, పారాలీగల్‌ వాలంటీర్‌ అద్దంకి మధుసూదన్‌రావు, పాఠకులు పాల్గొన్నారు.
మార్కాపురం: 16వ శతాబ్దపు ప్రముఖ కవయిత్రి ‘మొల్ల రామాయణం’ రచించిన ‘మొల్లమాంబ’ విగ్రహాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి గురువారం ఆవిష్కరించారు. స్థానిక తర్లుపాడు రోడ్డులోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వద్ద రహదారి మధ్యలో డివైడర్‌పై శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.

➡️