ప్రజాశక్తి – బాపట్ల : శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు సాహిత్య రంగానికి మహా ప్రభంజనమని అదనపు ఎస్‌పి టిపి. విఠలేశ్వర్ తెలిపారు. మహాప్రస్థానం 75 వసంతాల సందర్భంగా శ్రీశ్రీ సాహిత్య నిధి సౌజన్యంతో ప్రచురించిన ‘జ్వాలాతోరణం’ పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఫోరం కార్యదర్శి పిసి.సాయిబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్‌పి మాట్లాడుతూ శ్రీశ్రీ అక్షరాలు కత్తులుగా, ఈటెలుగా మారి, బడబాగ్నిని రగులు స్తాయన్నారు. పేదవాళ్ల కన్నీళ్లు తుడుస్తాయని తెలిపారు. అనేకమందికి స్వాంతన కలిగిస్తాయన్నారు. అలాంటి మహాప్రస్థానాన్ని నేటి యువత పఠించి,స్ఫూర్తి పొందాలన్నారు. కార్యక్రమంలో విజయవాడ శ్రీశ్రీ సాహిత్య అధినేత, కవి సింగంపల్లి అశోక్ కుమార్, శ్రీశ్రీ జాతీయ పురస్కార గ్రహీత అడుసుమిల్లి మల్లికార్జున, చిత్రకారుడు జీవి, ఉపాధ్యాయులు రామకష్ణ, అధ్యాపకులు అబ్దుల్ కలాం, ఇక్కుర్తి శ్రీనివాస్, పిన్నిబోయిన శ్రీమన్నారాయణ, మానవత కార్యదర్శి ఎం. ప్రసన్నాంజనేయలు, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు
