ప్రజాశక్తి – కడప ప్రతినిధి కొప్పర్తి పారిశ్రామికవాడకు మహర్ధశ పట్టనుంది. బుధవారం కేంద్ర కేబినెట్‌లో కొప్పర్తి పారిశ్రామికవాడ పారిశ్రామిక హబ్‌గా మార్పు చెందడానికి ఆమోదం లభించినట్లు కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్ పేర్కొన్నారు. దేశంలోని 234 కొత్త పట్టణాలను ఎఫ్‌ఎం ఛానల్స్ కలిగిన నగరాలుగా అభివృద్ధి పరచనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, మదనపల్లి పట్టణాల్లో మూడు ఛానళ్ల చొప్పున గుర్తింపు లభించింది. ప్రధానంగా కొప్పర్తి పారిశ్రామికవాడకు స్థానం లభించింది. కొప్పర్తి పారిశ్రామికీకరణకు అవసరమైన పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. స్థానిక ఉత్పత్తులకు గల అవకాశాల ఆధారంగా ఎటువంటి సెక్టార్లు అభివృద్ధి చెందడానికి గల అవకాశాలు ఉన్నాయనే కోణాలను స్పృశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొప్పర్తిలో వైఎస్‌ఆర్ పారిశ్రామికహబ్ పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. ఆల్ డిక్సన్ కంపెనీ మూడు షిప్టుల ప్రకారం రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తి కార్యకలాపాలను వేగవంతం చేసింది. పలు ఎంఎస్‌ఎంఇలు కార్యకలాపాలను సాగిస్తుండడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తి పారిశ్రామికవాడలో రూ.8,860 కోట్లతో పారి శ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడానికి ముందుకు రావడం నిరుద్యోగ లోకానికి ఉపశమనం కలిగిస్తోంది. 2,596 ఎకరాలను పారిశ్రామికాభివృద్ధికి కేటాయించనున్నారు. రూ.2,137 కోట్లతో కూడిన ప్రాజెక్టు వ్యయాన్ని కేటాయించనున్నట్లు ప్రకటించారు. 54,500 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా రిన్యూవబుల్స్, ఆటో మొబైల్స్ విడిబాగాలు, నాన్ మెటాలిక్ మినరల్స్, టెక్స్‌టైల్స్, కెమి కల్స్, ఇంజినీరింగ్ విడిభాగాలు, మెటాలిక్ వస్తువులను ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలను పరిశీలించారు. కొప్పర్తి పారిశ్రామి కాభివృద్ధి రాయలసీమ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా మారుతుందని భావించారు. కొప్పర్తి పారిశ్రామికవాడ అభివృద్ధి చెందడానికి అనువైన రీతిలో మౌలిక సదుపాయాలైన స్టేట్ హైవే, నేషనల్ హైవే, రైల్వే, ఎయిర్, పోర్టు కనెక్టివిటీ అంశాలను ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా 250 కిలోమీటర్ల పరిధిలో చెన్నరు, బెంగళూరు నగరాలు ఉండడంతో కలిసి రానున్నట్లు గుర్తించారు. కొప్పర్తి పారిశ్రామికవాడకు ఎస్‌హెచ్-51 కడప-పులివెందుల రహదారి, ఐదు కిలోమీటర్ల సమీపంలో ఎన్‌హెచ్-40 కర్నూలు-రాణిపేట నేషనల్ హైవే, ఎనిమిది కిలోమీటర్ల సమీపంలో ఎన్‌హెచ్-716 నెంబరు గల కడప-చెన్నరు నేషనల్‌హైవే, ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఎన్‌హెచ్ 544ఎఫ్ అనంతపురం-విజయవాడ నేషనల్ హైవేలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. మరో తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో కృష్ణాపురం, 13 కిలోమీటర్ల పరిధిలో కడప రైల్వే జంక్షన్, 11 కిలోమీటర్ల పరిధిలో కడప ఎయిర్‌పోర్టు, 150 కిలోమీ టర్ల సమీపంలో తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, 200 కిలోమీటర్ల పరిధిలో కృష్ణపట్నం పోర్టు, 270 కిలోమీటర్ల సమీపంలో చెన్నరుపోర్టు, 196 కిలోమీటర్ల పరిధిలో కొప్పర్తి రైల్‌కార్గో ఇంట ర్నేషనల్, 157 కిలోమీటర్ల పరిధిలో అనంతపురం ఎంఎంఎల్‌పి వంటి సదుపాయాలు అందుబాటులో ఉండడం కలిసి రానున్నట్లు ప్రకటించింది. కొప్పర్తికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించడంతో పారిశ్రామికవాడ పారిశ్రామిక హబ్‌గా మారడానికి వడివడిగా ముందుకు సాగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు.
