ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలోని రహదారుల మరమ్మతులకు రంగం సిద్ధమైంది. జిల్లా ఆర్‌అండ్‌బి ఇంజినీరింగ్ యంత్రాంగం రూ.15.52 కోట్లతో రెండు ప్యాకేజీలుగా 105 పనులను విభజించింది. టెండర్ల నిర్వహణ అనంతరం ఎంపిక చేసిన రహదారుల్లోని గుంతలను పూడ్చడానికి కసరత్తు చేస్తోంది. ఇటీవల టెండర్లను సైతం పిలిచింది. అక్టోబర్ నెలాఖరు నాటికి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకునే పనుల్లో నిమగమైంది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి రహదారుల్లోని గుంతలకు మరమ్మతులు చేయడానికి సిద్ధమైంది. జిల్లాలో ఆర్‌అండ్‌బి నాలుగు వేల కిలోమీటర్ల మేర రహదారులను కలిగి ఉంది. జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, పులివెందుల డివిజన్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించిన నేపథ్యంలో రహదారులు గుంతలమయం కావడంతో తరుచుగా ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం రూ.290 కోట్లతో రహదారుల్లోని గుంతలను పూడ్చాలని నిర్ణయించింది. జిల్లా ఆర్‌అండ్‌బి డిపార్టుమెంట్ 15.52 కోట్లతో 105 పనులను గుర్తించింది. ప్రభుత్వానికి అత్యసవర మరమ్మతుల కేటగిరీ కింద రూ.12.82 కోట్లతో 65 పనులు, ఇంటెన్సివ్ కేటగిరీ పరిధిలో రూ.2.70 కోట్లతో 40 పనులు చేపట్టాలని ప్రతిపాదనలు పంపించింది. కడప డివిజన్‌లో రూ.2.21 కోట్లతో 30 పనులు చేపట్టనుంది. అత్యసవర మరమ్మతుల కేటగిరీ కింద రూ.133 కోట్లతో 10 పనులు, ఇంటెన్సివ్ మరమ్మతుల కేటగిరీ కింద రూ.87,8 లక్షలతో 20 పనులు చేపట్టింది. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో రూ.7.90 కోట్లతో 41 పనులు చేపట్టింది. అత్యవసర పనుల కేటగిరీ కింద రూ.6.91 కోట్లతో 31 పనులు, ఇంటెన్సివ్ కేటగిరీ కింద రూ.98 లక్షలతో 11 పనులు చేపట్టింది. పులివెందుల డివిజన్‌లో రూ.5.32 కోట్లతో 33 పనుల్ని చేపట్టనుంది. అత్యవసర కేటగిరీ కింద రూ.4.55 కోట్లతో 24 పనులు, ఇంటెన్సివ్ కేటగిరీ కింద రూ.84 లక్షలతో తొమ్మిది పనులు చేపట్టనుంది. రోడ్ల మరమ్మతు పనులకు ఆమోదం లభించింది. ఆర్‌అండ్‌బి ఇంజినీరింగ్ యంత్రాంగం టెండర్లను నిర్వహించింది.