మహనీయుడు సుందరయ్య

పుచ్చలపల్లి సుందరయ్య

భావితరాలకు ఆయన మార్గదర్శి

వర్థంతి సభలో పలువురు వక్తల ఉద్ఘాటన

అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ‘మతోన్మాదం-రాజ్యాంగం-ప్రస్తుత సవాళ్లు’పై స్మారకోపన్యాసం

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ విలేకరి పేదల పెన్నిధి, ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య మార్గం అనుసరణీయమని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. భావితరాలకు ఆయన మార్గదర్శి అని ఉద్ఘాటించారు. ఆయన స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఆదివారం ఉదయం విశాఖ డాబాగార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతి సభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ‘మతోన్మాదం – రాజ్యాంగం – ప్రస్తుత సవాళ్లు’ అన్న అంశంపై స్మారకోపన్యాసం చేశారు. లౌకికవాదం, సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తూ దేశంలో ప్రధాని మోడీ పదేళ్లుగా పాలన సాగిస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో నేటి యువతరానికి సుందరయ్య జీవిత ఆదర్శాలు, ఆయన చేసిన రచనలు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. సుందరయ్యకు నిజమైన నివాళి అంటే రాజ్యాంగ హక్కుల రక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పాటుపడటమేనన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ మాట్లాడుతూ భారతదేశం లౌకిక రాజ్యమని రాజ్యాంగంలో పొందుపరచబడిందన్నారు. నేడు రాజ్యాంగంపై కేంద్ర బిజెపి ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. దర్యాప్తు సంస్థలను సైతం తమ ఆధీనంలో పెట్టుకొని ఆడిస్తోందన్నారు. రాజ్యాంగానికి ప్రమాదం వస్తే రక్షించాల్సిన రెండే రెండు వ్యవస్థలు న్యాయ వ్యవస్థ, మీడియా అని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ వచ్చి రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిన సమయంలో న్యాయ వ్యవస్థ, మీడియా కలిసి దేశాన్ని రక్షించాయని తెలిపారు. గతంలో భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిన సమయంలో సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరును గుర్తుచేశారు. నేడు మోడీ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రెండు వ్యవస్థలనూ తన ఆధీనంలో పెట్టుకున్నారన్నారు. మీడియా మొత్తం కార్పొరేట్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందని అన్నారు. 2018లో ఎన్నికల బాండ్లపై కోర్టులో పిటిషన్‌ వేస్తే బిజెపి పొందాల్సిన లబ్ధినంతా పొందిన తర్వాత 2024లో కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు దేశంలో చాలా దురాగతాలను ప్రోత్సహించే విధంగా తీర్పులిచ్చిందన్నారు. నేడు అప్పుడప్పుడూ మాత్రమే ఒకటి రెండు మంచి తీర్పులు వస్తున్నాయన్నారు. నేటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం అల్లూరి విజ్ఞాన కేంద్రాన్ని ఇదే రోజున ప్రారంభించామన్నారు. సామాజిక తరగతులను సమీకరించే కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటోందన్నారు. కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, బొట్టా ఈశ్వరమ్మ, బి.జగన్‌, నాయకులు రెడ్డి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ప్రజానాట్య మండలి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేస్తున్న వి.శ్రీనివాసరావు, అజశర్మ

➡️