ప్లాస్టిక్‌ రహిత జీవన విధానంతో సంపూర్ణ ఆరోగ్యం : మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు

ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్‌ జిల్లా) : ప్రజారోగ్యానికి పరిశుభ్రతే మూలకారణమని, ప్లాస్టిక్‌ రహిత జీవన విధానంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, స్వచ్ఛ్‌ ఆంధ్రలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవశ్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో స్వచ్ఛంద్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని శనివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీసీఎల్‌ఏ కమిషనర్‌ జి.జయలక్ష్మి గారు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ గారితో పాటు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు గారు, తదితరులు పాల్గన్నారు. ముందుగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని, అక్కడ వర్మికంపోస్టు ఎరువును పరిశీలించారు. హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వద్దు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కఅష్ణప్రసాదు మాట్లాడుతూ … పర్యావరణహితమే ప్రధాన లక్ష్యంగా ప్లాస్టిక్‌ ముప్పు నుండి సమాజానికి విముక్తి కల్పిద్దామన్నారు. మానవ జీవనానికి ప్లాస్టిక్‌ వలన ఎంతో ముప్పు కలుగుతుందన్నారు. ముఖ్యంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ను ఎవ్వరూ వినియోగించవద్దన్నారు. ఇది 400 ఏళ్ళకు భూమిలో కలుస్తుందన్నారు. ఇది కూడా మైక్రో ప్లాస్టిక్‌ గా మారి భూగర్భ జలాలను కలుషితం చేస్తుందన్నారు. ప్లాస్టిక్‌ కాన్సర్‌ కు కారకం అన్నారు. నిత్యజీవితంలో మనమందరం జూట్‌ లేదా గుడ్డతో తయారు చేసిన సంచులు వినియోగించాలన్నారు. తాగునీటికి రాగి లేదా స్టీల్‌ బాటిళ్ళను వినియోగించాలని హౌటళ్ళలో గాజు-స్టీలు పాత్రలనే వినియోగించినట్లయితే ప్లాస్టిక్ను కొంత మేరకు నివారించేందుకు అవకాశం ఉందన్నారు. ఎవరికి వారు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగించుకోవాలన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం ఖచ్చితంగా అమలు చేసేందుకు అసెంబ్లీలో కూడా తన గళాన్ని వినిపించి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్నారు. ప్రతినెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛదివస్‌ కార్యక్రమం ద్వారా అందరినీ చైతన్య పర్చుదామన్నారు. పచ్చదనం పరిశుభ్రతలో ర్రాష్టాన్ని అగ్రగామిగా నిలుపుదామన్నారు. పచ్చదనం పరిశుభ్రతలో అధిక ప్రాధాన్యతనిచ్చేలా అధికారులు చేస్తున్న కఅషికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. బాధ్యత రహిత్యంగా బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలను వేయడం వలన డ్రైనేజ్‌ కాలువలు మూసుకుపోవడం కారణంగా దుర్గందంతో పాటు దోమలు ఉధృతంగా పెరిగి అంటు రోగాలు ప్రబలుతున్నాయన్నారు.ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్తవేసే అలవాటును అరికట్టాలన్నారు. చెత్తను డంపింగ్‌ యార్డ్లకు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్లీన్‌ స్టార్ట్‌ పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టి ప్రతి రోజు పరిసరాలు పరిశుభ్రతగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.

ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్‌ ….
అనంతరం ”నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్ర ప్రదేశ్‌ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ…. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్‌ ను స్వచ్ఛఆంధ్ర ప్రదేశ్‌ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.” అంటూ ప్రజలతో జిల్లా కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. గ్రీన్‌ అంబాసిడర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

➡️