ప్రధాన రహదారి అధ్వానం

నూతిబంద గ్రామ సమీపంలో అస్తవ్యస్తంగా ఉన్న సీలేరు-చింతపల్లి ప్రధాన రహదారి

ప్రజాశక్తి -సీలేరు

జీకే వీధి మండలం సీలేరు నుండి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో సప్పర్ల పరిధి నూతిబంద నుంచి ఆర్‌వి నగర్‌ మధ్య 12 కిలోమీటర్లు మేరకు అధ్వానంగా ఉంది. అడుగడుగునా పెద్ద పెద్ద గోతులతో అస్తవ్యస్తంగా ఉండడంతో వాహన చోదకులకు, ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళన గురవుతున్నారు. విశాఖపట్నం, నర్సీపట్నం నుండి భద్రాచలం, సీలేరుకు ఈ మార్గంలో పగటి పూట బస్సు సర్వీసులతో పాటు నైట్‌ సర్వీసులు కూడా అనునిత్యం అనునిత్యం తిరుగుతుంటాయి. తుని- సీలేరు, నర్సీపట్నం -సీలేరు బస్‌ సర్వీసులు కూడా ఈ మార్గంలో నిత్యం తిరుగుతుంటాయి. అలాగే ఒరిస్సా అంతర రాష్ట్రాల నుంచి వివిధ రకాల లోడ్‌లతో లారీలు, వ్యాన్లు, టిప్పర్లు తదితర వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలు అధిక శాతం ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇంతటి ప్రధాన రహదారి సక్రమంగా లేక తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలే సింగిల్‌ రహదారి, ఆపై రోడ్డు మొత్తం గోతులమయం, వర్షానికి కోతకు గురి కావడం, రక్షణ గోడులు కూడా శిథిలం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు ఎప్పుడు ఏ క్షణంలో ప్రమాదం జరుగుతుందోనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కొన్ని సార్లు వాహనాలు ఇర్కుపోయి గంటల కొద్దీ ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతుంది. 12 కిలో మీటర్ల మేరకు ఈ రహదారి అధ్వానంగా ఉన్నప్పటికీ చింతపల్లి సబ్‌ డివిజనల్‌ ఆర్‌ అండ్‌ బి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా ప్యాచ్‌ వర్కులు చేసినా కొంత రహదారి మెరుగ్గా ఉంటుందని, అది కూడా చేయకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని పలువురు అంటున్నారు. భారీ వర్షం కురిస్తే గోతుల్లో నీరు చేరి ఎక్కడ గొయ్యి ఉందో తెలియక వాహనాలు ప్రమాదానికి గురవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్పందించి నూతిబంద నుంచి ఆర్‌వి నగర్‌ వరకు 12 కిలోమీటర్లు తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

➡️