4 న జరిగే విద్యా సంస్థల బంద్‌ ను విజయవంతం చేయండి : విద్యార్థి సంఘాలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అసమర్థ ఎన్‌టియు ను రద్దు చేయాలనీ, కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలనీ డిమాండ్‌ చేస్తూ …. ఈ నెల 4 వ తేదిన కేజీ నుంచి పీజీ వరకు జరిగే విద్యా సంస్థలు బంద్‌ ను విజయవంతం చేయాలని ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా అధ్యక్షులు డి.రాము, ఏ ఐ ఎస్‌ ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాగభూషణం పిలుపునిచ్చారు. మంగళవారం విజయనగరం టౌన్‌లోని స్థానిక అమర్‌ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ …. ఇటీవల నిర్వహించిన నీట్‌ పరీక్ష లీకేజి చేసి భారీ కుంభకోణం జరిగిందన్నారు. నీట్‌ పరీక్ష ఫలితాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల నెట్‌, నీట్‌ పరీక్షలు రాసి, నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఉన్న అడ్మిషన్‌ విధానాలను కేంద్రీకఅత ప్రవేశ పరీక్షలతో భర్తీ చేసే ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలన్నారు. టీ.ఐ.ఎస్‌.ఎస్‌ ముంబయి, ఐఐటి ముంబయి నుండి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటి వరకు – విద్యార్థి సంఘ నేతల పై అక్రమ కేసులు, నిర్బంధాలు, యూనివర్సిటీల్లో స్వేచ్ఛా వ్యక్తీకరణ ప్రజాస్వామ్య అణచివేత చర్యలను ఆపాలన్నారు. పాఠశాలల మూసివేతను ఆపాలని కోరుతూ … దేశవ్యాప్తంగా జూలై 4 న జరిగే విద్యా సంస్థల బంద్‌ లో విద్యార్దులు, ప్రజలు పాల్గని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బంద్‌ గోడపత్రికను విడుదల చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ ఎఫ్‌ ఐ నాయకులు రవికుమార్‌, రాజు, వెంకటరమణ, ఏ ఐ ఎస్‌ ఎఫ్‌ నాయకులు గౌరు, ప్రసాద్‌, భాను, జ్యోతి, శ్రావణి పాల్గొన్నారు.

➡️