ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ప్రపంచ ఆదివాసీ హక్కుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా …. ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్న ప్రపంచ ఆదివాసీ వారోత్సవాలను విజయవంతం చేయాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరాబు సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని ఎంవిపి కాలని గిరిజన భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ … సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో తీవ్రంగా వెనుకపడ్డ ఆదివాసీ గిరిజనులు సమైఖ్యంగా పోరాడి తమ హక్కులు సాధించుకుని వాటిని నిలుపుకోవాలని కోరారు. తమ సమస్యలు, సాధక బాధకాలను ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో కూలంకుషంగా చర్చించి తగు నిర్ణయాలు, తీర్మానాలు చేస్తామన్నారు. కేంద్రంలోని, రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజన వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ తమను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పుతామని హామీ ఇచ్చి, ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. దీనికి సుమారు 1100 కోట్లు రూపాయల వరకు అవసరమవ్వగా ప్రతి బడ్జెట్లోనూ 3 కోట్లు, లేదా 4 కోట్లు రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నారని విమర్శించారు. పలు ప్రభత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్నందువల్ల తాము ఉద్యోగావకాశాలను కోల్పో తున్నామని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఈ విలేఖరుల సామావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి రూడ సత్తా రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డిప్పల సాంబ మూర్తి, కార్యాలయపు కార్యదర్శి సరమండ గీత, శోభన్ కుమార్, డి.పి.శేఖర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచ ఆదివాసీ వారోత్సవాలను విజయవంతం చేయండి : అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం
