మన్యంలో విజృంభిస్తున్న మలేరియా

మన్యంలో విజృంభిస్తున్న మలేరియా

బూరిగ కొండశిఖర గ్రామంలో తిష్టవేసిన మహమ్మారి

అల్లాడిపోతున్న పీడితులు.. పట్టించుకోని అధికారులు

సరైన వైద్యం అందక పక్క జిల్లా ఆసుపత్రులకు పరుగులు

తక్షణం వైద్యశిబిరం ఏర్పాటుచేయాలి : సిపిఎం, ఆదివాసీ గిరిజన సంఘం

ప్రజాశక్తి- అనంతగిరి : ఎపిడమిక్‌ సీజన్‌కు ముందే మన్యంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొండశిఖర గ్రామాల్లో సరైన వైద్యం అందక జ్వరపీడితులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వపరంగా తూతూమంత్రపు చర్యలు వల్ల దోమలు విజృంభించి జ్వరాలు ప్రబలగా, కలుషితనీరు, ఇతరత్రా పరిస్థితులతో మరింత తీవ్రమౌతున్నాయి. గ్రామాల్లో సరైన వైద్యం అందని పరిస్థితుల్లో నానాకష్టాలు పడుతూ, రోగులంతా ఆసుపత్రులకు పరుగులెడుతున్నారు. తక్షణమే గ్రామాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి, మలేరియా మహమ్మారికి కట్టడికి చర్యలు చేపట్టాలని సిపిఎం, ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు కోరుతున్నారు.అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ బూరిగ కొండ శిఖర గ్రామాల్లో నెల రోజులుగా జ్వరాలతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో 28 కుటుంబాలకు చెందిన సుమారు 150 మంది జనాభా నివసిస్తుంటే, ఇంటింటా జ్వరపీడితులు ఉన్నారా అన్నట్లు మలేరియా మహమ్మారి నెలరోజులుగా తిష్టవేసి ఉంది. వైద్యసదుపాయం అందుబాటులో లేకపోవడం, కొండశిఖర గ్రామం కావడంతో రవాణా, రాకపోకల సౌకర్యం కూడా లేకపోవడంతో కొండమార్గంలో కాలినడకన, డోలిమోతలతో జ్వరపీడితులను ఆసుపత్రులకు తరలిస్తున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అనేకమంది మలేరియా బాధితులు గ్రామంలో మంచం పట్టి మగ్గిపోతున్నారని వాపోతున్నారు.

ఆసుపత్రులకు వెళ్లాలంటే యమ యాతన

జ్వరపీడితులు భీమవరం పిహెచ్‌సికి వెళ్లాలంటే కనీసం 50కిలోమీటర్లు దూరం ఉంటుందని, లేదంటే విజయనగరం జిల్లా గజపతినగరం ఆసుపత్రికి వెళ్లాలన్నా, 60కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎస్‌కోట ఆసుపత్రికి వెళ్లాలన్న కొండమార్గంలో డోలిమోతలే శరణ్యమని అంటున్నారు. అయినా పదులసంఖ్యలో మలేరియా రోగులను అక్కడికి తరలించి, వైద్యసేవలు అందిస్తున్నామని బాధితుల కుటుంబసబభ్యులు అంటున్నారు. గజపతినగరం, ఎస్‌.కోట ఆసుపత్రుల్లో చికిత్సకాగా ఇప్పటికే గ్రామం నుంచి అనేకమంది జ్వరపీడితులను గజపతినగరం, ఎస్‌.కోట ఆసుపత్రులకు తరలించినట్లు గ్రామస్తులతోపాటు సిపిఎం, ఆదివాసీ గిరిజన సంఘం నేతలు అంటున్నారు. పదిరోజులుగా గజపతినగరం ఆసుపత్రిలో సోములు వీరయ్య, బడ్నయిన కొత్తమ్మ, బూరుగ, సుకరయ్య, సోమ్మెల ,పోలమ్మ, సోమ్మల జెంట్స్‌ మేరీ, పొట్టంగి పోలయ్య, బడ్నాయిని బుజ్జిబాబు, బడ్నాయిని, కిరణ్‌ కుమార్‌ వైద్యానికి తీసుకెళ్లామని, వీరిలో ముగ్గురు జ్వరం నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మిగిలిన వారంతా ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని స్థానికులు అంటున్నారు. అలాగే ఎన్‌ ఆర్‌ పురం మీదుగా ఎస్‌.కోట ఏరియా ఆసుపత్రికి సొంత వాహనాలపై బూరుగ రామకష్ణ, సోముల పోలమ్మ, సోమ్మెల సోములమ్మ, సోముల ఆదమ్మ, గాలిపర్తి చిన్నమ్మ, గాలిపర్తి సొట్టయ్య, సోమ్మెల, ఎర్రయ్య, బురిగా రవి, బూరిగ కవిత అనే రెండున్నరేళ్ల చిన్నారిని కూడా ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. ఆరోగ్యం ఇంకా విషమించిన వారిని విశాఖ ఆసుపత్రికి తరలించక తప్పడం లేదని, అప్పటికే పరిస్థితి విషమించి, తిరిగి రావడం కల్లేనని అంటున్నారు.

ముందస్తు చర్యల్లో నిర్లక్ష్యం

మన్యంలో ఏటా మలేరియా, ఇతర విషజ్వరాలు ప్రబలడం సర్వసాదారణమైన, వాటిని నియంత్రించేందుకు ముందస్తు చర్యల్లో అధికార యంత్రాంగం విఫలమౌతోందని సిపిఎం,ఆదివాసీ గిరిజన సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె గోవింద్‌, ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు సివేరి కొండలరావు మాట్లాడుతూ, బూరిగ కొండ శిఖర గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక కలుషిత నీటిని తాగాల్సిన పరిస్థితి ఉండడం, రెండేళ్లుగా దోమతెరలు పంపిణీ జరగలేదని, మలాథియాన్‌ స్ప్రేయింగ్‌ తూతూమంత్రంగా చేసుకుపోతున్నారని, దీంతో దోమలతోపాటు మలేరియా జ్వరాలు విజృంభించడమే కాకుండా తిష్టవేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.

తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేయాలి

జ్వరాలు ప్రబలిన తర్వాత అందుబాటులో సరైన వైద్యం లేకపోవడంతో రోగపీడితులు మరింతగా అస్వస్థతకు గురవుతున్నారని సిపిఎం, ఆదివాసీ సంఘం నేతలు అంటున్నారు. తక్షణమే బూరిగ గ్రామంలో అవసరమైన అన్ని మందులతో మెగా వైద్యశిబిరం ఏర్పాటుతోపాటు మలేరియా, ఇతర జ్వరాలు అదుపులోకి వచ్చేంతవరకు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో పాడైన మంచినీటి బోరును బాగుచేయించాలని, మలేరియా బాధితులకు ఉచితంగా రేషన్‌బియ్యం, కందిపప్పు, ఇతర నిత్యావసరాలను అందజేయాలని కోరారు. జిల్లా మలేరియా విభాగం నిర్లక్ష్యంతో క్షేత్రస్థాయి సిబ్బంది వైఫల్యం చెందిన నేపథ్యంలో ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.

ఎస్‌ కోట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న జ్వరపీడితుడు రవి

➡️