తూతూ మంత్రంగా మండల సమావేశం

ప్రజాశక్తి-శింగరాయకొండ : కోరం లేక పోవడంతో శింగరాయకొండ మండల సర్వసభ్య సమావేశం మంగళవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే అధికారులు ఎంపిటిలసు బతిమలాడి పిలిపించుకొని ఎట్టకేలకు సమావేశం తూతూ మంత్రంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపిటిసిలను సమావేశాన్ని తీసుకువచ్చే బాధ్యతలు తీసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో కార్యదర్శులు ఎంపిటిసిలను సమావేశానికి తీసుకొచ్చారు. తొలుత ఎంపిపి కట్ట శోభారాణి, ఎంపిడిఒ నగేష్‌కుమారి, తహశీల్దారు భవానీ శంకర్‌, కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ సర్దార్‌, పాకల సర్పంచి సైకం చంద్రశేఖర్‌, బింగినపల్లి సర్పంచి జెట్టి విజయలక్ష్మి సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శులు ఎంపిటిసిలకు పోన్‌ చేసి సమావేశానికి వచ్చేలా కృషి చేశారు. దీంతో ఎంపిటిసిలు సమావేశానికి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు సమావేశం వేదికగా ప్రజా సమస్యలపై చర్చించకుండానే వెళ్లిపోయారు. అధికారులు వచ్చిన వారితో సంతకాలు పెట్టించుకుని తూతూ మంత్రంగా మండల పరిషత్‌ సమావేశాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఎఇ కోటా శ్రీహరి, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️