చింతూరు (అల్లూరి) : వి.ఆర్.పురం మండలంలోని ప్రజా సమస్యలను సిపిఎం బృందం, మండల ఎంపిపి కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చింతూరులోని సిపిఎం బృందం, మండల ఎం.పి.పి కారం.లక్ష్మి, ప్రజా ప్రతినిధులు కలిసి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐ.ఏ.ఎస్ ను కలిసి వి.ఆర్.పురం మండలంలోని ప్రజాసమస్యలను కలెక్టర్ దఅష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ములకనపల్లి, రామవరం, రేఖపల్లి, పెద మట్టపల్లి పంచాయితీలలో గ్రామాలకు సి.సి రోడ్లు, రహదారులు మంజూరు చేయాలని, ప్రధానంగా పెద్దమట్టపల్లి నుంచి నర్సింగపేట రోడ్డును గత ప్రభుత్వంలో తవ్వి వదిలేసి 4 సంవత్సరాలు అవుతుందని, దీని పర్యావసనంగా 25 గ్రామాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హాస్పిటల్స్‌కు గర్భిణీలను తీసుకురావటం నరకయాతనగా ఉన్నదని చెప్పారు. మండల కేంద్రానికి ప్రజలు నిత్యావసరాల కోసం రావాలన్నా, రైతులు ఎరువులు తీసుకెళ్ళాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ కు గుర్తు చేశారు. తక్షణమే పెదమట్టపల్లి నుంచి నర్సింగపేట వరకు రోడ్డును నిర్మించాలని కోరారు. అదేవిధంగా శ్రీరామగిరి, జీదిగుప్ప, తుమ్మిలేరు పంచాయితీలలో మొదటి కాంటూరులో ముంపుకు గురయ్యే పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, భూమికి భూమి, భూ నష్టపరిహారం పెండింగ్‌లో ఉన్నదని… గిరిజనులు సాగుచేస్తున్న అసైన్డ్‌మెంట్ భూములను సర్వే నిర్వహించి భూ నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు. ఈ వరదల సమయంలో వరద బాధితులను అన్నివిధాలుగా ఆదుకోవటానికి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి బోట్లు, నిత్యావసరాలు, కిరోసిన్ ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. వరదల్లో మండల ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చింతూరు నుంచి రామన్నపాలెం మీదుగా పెదమట్టపల్లి వరకు 33 కెవి లైన్ ఏర్పాటు చేయాలని, నిత్యావసర సరుకులు తీసుకురావటానికి వీలుగా చింతూరు నుంచి కన్సూలూరు మీదుగా కుందులూరు వరకు రహదారి మంజూరు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ను కలిసినవారిలో మండల ఎంపీపీ కారం లక్ష్మి, సిపిఎం జిల్లా నాయకులు పూణెం.సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం.చినబాబు, సర్పంచులు పులి.సంతోష్ కుమార్, సవలం.మారయ్య, పూనెం.సరోజిని, వెట్టి.లక్ష్మి, కారం.బుచ్చమ్మ, ఎంపీటీసీ ప్రదీప్ కుమార్, సిపిఎం నాయకులు కారం.సుందరయ్య, గుండిపూడి.లక్ష్మణరావు, శ్రీరపు.తాతబాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ … జిల్లా కలెక్టర్‌కు మండల ఎంపిపి-సిపిఎం బృందం వినతి
