మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. మండపేట వాసి మృతి

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : జీవనోపాధి అయిన వ్యాపారం నిమిత్తం మహారాష్ట్ర వెళ్లిన మండపేట వాసి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంఘటన స్థానికంగా కలచివేసింది. స్థానికులు, మృతుడి తరపు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొండపల్లి వారి వీధిలో నివాసముంటున్న పరమటి జితేంద్ర (33) మహారాష్ట్రలోని ఉద్గార్‌ లోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. మార్చి 7న ఫైనాన్స్‌ లైన్‌ కు  బైక్  పై బయలుదేరిన జితేంద్రను రహదారిపై నాలుగు చక్రాల గూడ్స్‌ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన జితేంద్రను స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అక్కడి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మహారాష్ట్ర నుంచి సోమవారం రాత్రి మండపేట కు జితేంద్ర భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. మృతునికి భార్య మూడు నెలల పాప ఉన్నారు. తమను పోషించడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయావా అంటూ భార్య కుటుంబ సభ్యులు పెట్టిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి.

➡️