నందిగామ మున్సిపల్‌ చైర్మన్‌ గా మండవ కృష్ణ కుమారి

ప్రజాశక్తి- నందిగామ (ఎన్టీఆర్‌) : నందిగామ మున్సిపల్‌ చైర్మన్‌ గా 10 వ వార్డు కౌన్సిలర్‌ మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. మంగళవారం నందిగామ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక బాబు జగ్జీవన్‌ హల్‌ లో ఆర్‌ డి ఓ బాలకృష్ణ ఎన్నికల అధికారి సమక్షంలో జరిగింది. మండవ కృష్ణ కుమారి చైర్మన్‌ గా ఎన్నిక కావడానికి టిడిపి, జనసేన, ఎక్స్‌ ఆఫిసియ్షె సభ్యులు, నందిగామ ఎంఎల్‌ఎ తంగిరాల సౌమ్య హాజరయ్యారు. 15 మంది చేతులెత్తి ఆమోదం తెలిపారు. వైసిపి కౌన్సిలర్లు నలుగురు హాజరయ్యారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిర్ణయానికి కూటమి కౌన్సిలర్స్‌ ఆమోదం తెలిపారు. గత రెండు రోజులుగా నందిగామ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక పై జరిగిన హైడ్రామాకు తెరపడింది. తొలుత నందిగామ మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి టిడిపి ప్లోర్‌ లీడర్‌ శాఖమూరి స్వర్ణ లత, 14 వ వార్డు కౌన్సిలర్‌ కామసాని సత్యవతి తీవ్రంగా పోటీపడ్డారు. పిట్ట పోరు పిల్లి తీర్చునట్లుగా మండవ కృష్ణ కుమారి చైర్మన్‌ గా ఎన్నిక కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మండవ కృష్ణ కుమారి చైర్మన్‌ గా ఎన్నిక కావడం పట్ల పలువురు టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

➡️