మంగళగిరి, గుంటూరు పశ్చిమదే ఆధిక్యం

Apr 22,2024 00:53

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వచ్చేనెల 13న జరగనున్న రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గుంటూరు,పల్నాడు జిల్లాల్లోని ఓటర్లు సంసిద్ధమవుతున్నారు. గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లు స్వల్పంగా పెరిగారు. ఈఏడాది జనవరి 22వ తేదీన తుది జాబితా ప్రకటించిన తరువాత మళ్లీ ఇటీవల ఎన్నికల షెడ్యూలు వచ్చేవరకు ఓటర్ల. జాబితాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. అంతేగాక గతంలో దాఖలు చేసిన ఫారం -7,8, ప్రకారం పెద్దసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని వీటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించడంతో అధికారులు గత నెల 31కి తుది ఓటర్ల జాబితాలను ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత కూడా ఈనెల 15వ వరకు ఓటర్లుగా చేరేందుకు కొత్తవారికి అవకాశం కల్పించారు. గతనెల 31 వరకు నమోదు అయిన ఓటర్ల జాబితాల్లో వివరాలు ఇలాఉన్నాయి. గుంటూరు లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 17,82,438 ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,60,998 మంది పురుషులు, 9,21,333 మంది మహిళలు, 191 మంది థర్డ్‌ జండర్‌, 930 మంది ఓవర్సీస్‌ ఓటర్లు, 1780 సర్వీస్‌ ఓటర్ల నుంచి 1775కి తగ్గారు. ఉన్నారు. మార్చి 22న విడుదల చేసిన జాబితాల్లో గుంటూరు జిల్లాలో పురుషులు 8,55,262, మహిళలు 9,13,852 ఉన్నారు. పల్నాడు జిల్లాలో తాజా జాబితాల్లో మొత్తం 17,22,410 మంది ఉన్నారు. గత జనవరిలో విడుదల చేసిన జాబితా ప్రకారం పల్నాడు జిల్లాలో పురుషులు 8,37,200, మహిళలు 8,75,433 మంది ఉన్నారు. థర్డ్‌ జండర్‌ 190 మంది ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 2,90,430 మంది ఓటర్లతో ఉమ్మడిజిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో 2,76,680 మంది ఓటర్లతో గుంటూరుపశ్చిమలో ఉంది. పల్నాడుజిల్లాలో గురజాల నియోజకవర్గంలో అత్యధికంగా 2,72,152 మందితో మొదటి స్థానంలో ఉంది. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 65 వేల మంది 18 ఏళ్లుదాటిన యువకులు ఈ సారి కొత్త ఓటర్లుగా చేరారు.

➡️