ప్రజాశక్తి-పుల్లంపేట మంగంపేట బెరైటీస్ కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కారం చూపలేని కారణంగా ఈ నెల 16వ తేదీ నుంచి కార్మిక సంఘాలు సమ్మె చేస్తామని ప్రకటించాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు అన్నారు. ఎపిఎండిసి మంగంపేట సంస్థ బ్రాంచ్ ఆధ్వర్యంలో నాలుగు కార్మిక సంఘాలు ఐదు డిమాండ్స్ పరిష్కరించాలని ఎపిఎండిసి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద దశల వారి ఆందోళనలో భాగంగా భోజన విరామ సమయంలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నినాదాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టి నేటికీ ఎనిమిది రోజులకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబులవారిపల్లి మండల పరిధిలోని మంగంపేట ఎపిఎండిసి కార్మిక సంఘాలతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. కార్మికుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందని యాజమాన్యానికి తెలియజే శామన్నారు. ఈ మధ్యకాలంలో ఎపిఎండిసి యాజమాన్యం సి, డి గ్రేడ్ టెండర్‌ను పిలవడం జరిగిందని, ఈ టెండర్ సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడేలా ఉందని మండిపడ్డారు. ప్రస్తుతం సి, డి గ్రేడ్ ఒక టన్నుకు రూ.1680 ఉంటే ఎపిఎండిసి యాజమాన్యం మాత్రం 60 లక్షల టన్నుల సి, డి గ్రేడ్ టెండర్ పిలిచిన దానిలో తన్నుకు కేవలం రూ.1188 పెట్టడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ టెండర్ వల్ల సంస్థ మనుగడకు ప్రమాదం ఏర్పడి దీనిని నమ్ముకుని జీవిస్తున్న సుమారు 700 మంది నిర్వాసిత కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని వెంటనే సి, డి గ్రేట్ టెండర్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. ఎపిఎండిసి యాజమాన్యం ప్రతి సంవత్సరం వేలకోట్ల రూపాయలు ఆదాయం గడిస్తోందన్నారు. ఆ లాభాల సొమ్మును ఏం చేశారో చెప్పకుండా ఐదువేల కోట్ల రూపాయలకు సమస్త ఆస్తులను అమ్మాలని చూడడం చాలా దారుణమని వెంటనే ఆ చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం 15వ తేదీ లోపు సమస్యలు పరిష్కరించుకుంటే 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళామని హెచ్చరించారు. ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ చంద్రశేఖర్, ఎ.రామాంజులు మాట్లాడుతూ యాజమాన్యం టెండర్ రద్దు చేయకుంటే ప్రాణాలకు తెగించైనా సంస్థను కాపాడుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, ప్రాజెక్టు వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకుమారి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్, జిల్లా నాయకులు, ఎపిఎండిసి అన్ని కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.