మామిడి ఎగుమతులు..!

Jun 9,2024 21:21
మామిడి ఎగుమతులు..!

కాయలు లేని మామిడి తోట
మామిడి ఎగుమతులు..!
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు నియోజకవర్గం నుంచి ఇతర రాష్ట్రాలకు బంగినపల్లి మామిడి ఎగుమతుల సాగుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, చత్తీఘడ్‌ వంటి రాష్ట్రాలకు బంగినపల్లి మామిళ్లు ఎగుమతులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని ఉలవపాడు కేంద్రంగా ఈ ఎగుమతులు సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులతో ఉలవపాడు ప్రాంతానికి చెందిన దళారులకు సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ దళారులు కందుకూరుతో పాటు కావలి, ఉదయగిరి నియోజకవర్గలలోని మామిడి తోటల నుంచి బంగినపల్లి మామిళ్ళ కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఎగుమతులు ఏటేటా జరిగేవి అయినప్పటికీ పంట దిగుబడి తక్కువగా ఉండడంతో ఎగుమతులు కూడా తగ్గాయి. ప్రతికూల వాతావరణం వల్ల ఈసారి నెల్లూరు జిల్లాలో కేవలం 15 శాతం పంట దిగుబడి వచ్చింది. జిల్లాలో సుమారు 24 వేల ఎకరాలలో మామిడి తోటలు విస్తరించి ఉండగా వాటిలో దాదాపు 15 వేల ఎకరాలు కందుకూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి. ప్రతికూల వాతావరణం వల్ల అధిక శాతం తోటల్లో పూతలు పూయనే లేదు. దీంతో సహజంగానే పంట దిగుబడి తగ్గింది. పంట దిగుబడి తగ్గడంతో మామిడికాయల ధరలు రైతులకు లాభసాటిగా పలుకుతున్నాయి. బంగినపల్లి మామిళ్ళ ధర నాణ్యతను బట్టి టన్ను 45 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయల వరకు పలుకుతున్నాయి. బెంగుళూరా మామిళ్ళ ధరలు టన్నుకు 28 వేల నుంచి 30 వేలు రూపాయలు పలుకుతున్నాయి. ఈ జిల్లాలో పండే బెంగుళూరు రకం అత్యధికం చిత్తూరు జిల్లాలోని జ్యూస్‌ ఫ్యాక్టరీలకు ఎగుమతి అవుతాయి. చెరుకు రసం మామిడి ధర టన్నుకు 40,000 నుంచి 45 వేల రూపాయల వరకు పలుకుతుంది. అయినా తగినని మామిడికాయలు దొరకకపోవడంతో ఇతర రాష్ట్రాలకు సరుకు ఎగుమతి చేసే దళాలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక్కడ నుంచి హర్యానాలోని గురుగావు వంటి నగరాలకు మామిడి ఎగుమతి చేయాలంటే లారి బాడుగా ఒక్క లక్ష 60 వేల రూపాయలు ఉంటుంది. అందువల్ల మూడు నాలుగు టన్నుల మామిళ్ళను అంత దూరం వేగమతి చేయలేరు. కనీసం 15 నుంచి 18 టన్నుల బంగినపల్లి మామిడి కాయలు దొరికితేనే గురుగావు వంటి నగరాలకు ఎగుమతులు జరుగుతాయి. అతి కొద్ది తోటల్లో మాత్రమే ఇంత సరుకు దొరుకుతుండడంతో దళాలు మామిళ్ళ కొనుగోలుకు ఊరూరా తిరుగుతున్నారు.

➡️