మంత్రి యోగం ఎవరికో?

కేబినెట్‌ బెర్త్‌ ఖరారుపై ఉత్కంఠ నెలకొంది. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం టిడిపి, బిజెపి, జనసేన కూటమి సర్కారు కొలువు దీరనుంది.మూడు దశాబ్దాలుగా ఉమ్మడి కడప జిల్లాలో టిడిపి కనివినీ ఎరగని మెజార్టీ స్థానాలు దక్కించుకున్న నేపథ్యంలో సర్కారులో స్థానానికి కూటమి తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారు. సీనియర్లు మొదలుకుని యువ ఎమ్మెల్యేలు సైతం ఉండడం గమనార్హం. పలువురు ఆశావహులు మూడ్రోజుల కిందటే రాజధాని కేంద్రమైన విజయవాడకు చేరుకుని ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిలో ఎవరిని కేబినెట్‌ బెర్త్‌ దక్కనుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. వైఎస్‌ఆర్‌ జిల్లా ఎన్నికల చరిత్రలో టిడిపి ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లాలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, బద్వేల్‌, రాజం పేట రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. టిడిపి కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, జనసేన రైల్వేకోడూరు, జమ్మలమడుగు నుంచి బిజెపి గెలుపొందిన సంగతి తెలిసిందే. కూటమి అభ్యర్థులు ఏడు స్థానాల్లో ఐదు టిడిపి, రెండు స్థానాల్లో బిజెపి, జనసేన గెలిచిన నేపథ్యంలో కేబినెట్‌ బెర్త్‌లో స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఆయా నియోజకవర్గాల ప్రాధాన్యత, సీనియారిటీ, యువ ఎమ్మెల్యేల మధ్య పోటీ నెలకొంది. టిడిపి తరుపున కడపలో గెలిచిన అభ్యర్థి ఆర్‌.మాధవి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకరయాదవ్‌, బిజెపి తరుపున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన సి.ఆదినా రాయణరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఎవరికి బెర్త్‌ దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. వీరితోపాటు ప్రొద్దుటూరు సీనియర్‌ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి పోటీ పడుతున్నారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ముద్ర కేబినెట్‌లో ఉండనున్నట్లు వార్తల వస్తున్న నేపథ్యంలో కొత్తగా శాసన సభలో అడుగు పెడుతున్న యువ ఎమ్మెల్యేలు, ఆర్‌.మాధవి, పుత్తా చైతన్యరెడ్డి, అరవ శ్రీధర్‌ ఆశలు పెంచుకున్న నేపథ్యం కనిపిస్తోంది. యథాశక్తి మేరకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవి వర్సెస్‌ బిజెపి ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి మధ్య పోటీ నెలకొంది. కూటమిలో పార్టీలు వేరైనప్పటికీ ఒకే సామాజిక వర్గం నేపథ్యంలో నేతల మధ్య ఆధిపత్య పోరు నెలకొని ఉంది. కేబినెట్‌లో బిసిలకు ఎనిమిది నుంచి తొమ్మిది బెర్త్‌లు దక్కే అవకాశాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో సీనియర్‌ నాయకులు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పీలేరు, మదనపల్లెలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి పేరు కూడా మంత్రి పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. అమాత్యయోగం ఎవరికి దక్కుతుందోననే అంశం సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తోంది.

➡️