అత్యధికంగా సాలూరులో45.2 డిగ్రీల ఉష్ణోత నమోదు
బయటకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలు
ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : రుతుపవనాల ప్రవేశానికి ముందుగా తన ప్రతాపం చూపిస్తున్న భానుడు శుక్రవారం అన్ని మండలాల్లోనూ నిప్పులు కురిపించడంతో జిల్లా అగ్నిగుండంగా మారింది. పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు వేడి వడగాడ్పులు వీస్తుండడంతో ప్రజలు వేసవితాపాన్ని భరించలేక విలవిలలాడారు. ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి బయట దాటడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, చిన్నారులు నిప్పులు కొలిమిలా మారిన వాతావరణాన్ని తట్టుకోలేక కొన్నిచోట్ల డీహైడ్రేషన్‌కు లోనయ్యారు. భానుడితాపానికి జిల్లా ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలను చూస్తే అర్ధం మౌతుంది. అత్యధికంగా సాలూరు మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిలిగిన మండలాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలిలా ఉన్నాయి. గరుగుబిల్లి 38.6 డిగ్రీలు, జియ్యమ్మవలసలో 41.6, కొమరాడ 39.1, సీతంపేట, సీతానగరం మండలాల్లో 44, బలిజిపేట 40.5, భామిని 40.3, మక్కువ 39.5, పార్వతీపురం, పాచిపెంట 40.4, కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణం వేడెక్కడంతో ఉపాధిహామీ కూలీలు పనులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. రానున్న రోజుల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ, విపత్తుల నివారణ శాఖకు చెందిన అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఉదయం 10గంటల తర్వాత బయటకు రాకూడదని, వచ్చినా నూలు దుస్తులు ధరించడం, శీతలపానీయాలు సేవించడంతో పాటు తప్పని సరిగా తలకు టోపీలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.