మన్యం బంద్‌ సంపూర్ణం

  •  జీవో నెంబర్‌ 3ను అమలు కోసం ఆర్డినెన్స్‌ వెంటనే తీసుకుని రావాలి
  •  ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి-పెదబయలు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : పెదబయలుమండల కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెదబయలు మండల కేంద్రంలో రాష్ట్ర మన్యం బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ సభ్యులు, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా పూర్వపు అధ్యక్షులు బొండా సన్నిబాబు మాట్లాడుతూ.. జీవో నెంబర్‌ 3ను అమలు కోసం ఆర్డినెన్స్‌ వెంటనే తీసుకుని రావాలన్నారు. జీవో నెంబర్‌ 3 రద్దు కావడంవల్ల, ఐదవ షెడ్యూల్‌ ఆదివాసి ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు నూటికి 100 శాతం రావలసిన ఉద్యోగ అవకాశాలు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్‌ 3 అమలుకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి స్పెషల్‌ డిఎస్సి నిర్వహించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఆదివాసి ప్రాంతాల్లో 700 మంది ఆదివాసి మాతభాష విద్య వాలంటీర్లు పనిచేస్తున్నారు. వెంటనే వారిని రెన్యువల్‌ చేసి కొనసాగించాలి పోలవరం ప్రాంతంలో నిర్వాసితులైనటువంటి ఆదివాసులకు పునరావాసం కల్పించాలన్నారు. చింతపల్లి ప్రాంతంలో నిర్మిస్తున్న హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ ను వెంటనే రద్దు చేయాలి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ బంద్‌కు సిపిఎం, టిడిపి, జనసేన పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. తెలుగుదేశం నాయకులు వి.కొండయ్య, బాలకష్ణ, జనసేన నాయకులు ప్రశాంత్‌, డీఎస్సీ సాధన కమిటీ కన్వీనర్‌ బి.నరేష్‌, ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి. గంగాధరం, సర్బన్న, కే.నీలకంఠం, సునీల్‌ కుమార్‌, పీ.బుజ్జి బాబు, గంగాధర, టిఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు తాంగుల జగత్రారు, ఆదివాసి వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి.భాస్కర్‌ జి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️