మన్యం సిగలో మరో మణిపూస

Dec 8,2024 21:39

అదరహో అంటున్న అడలి అందాలు

 రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకులు తాకిడి

ప్రజాశక్తి-సీతంపేట : మన్యం జిల్లాలో సీతంపేట ఏజెన్సీ ప్రాంతం ఇప్పటికే పర్యాటక హబ్‌గా రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతంలో జలపాతాలు, పచ్చని పొలాలు, అడవి చాటున అందాలు ఎన్నో దాగి ఉన్నాయి. అలాంటి మన్యం సిగలో మరో ‘వింత’ చేరింది. అదే అడలి వ్యూ పాయింట్‌. ఇక్కడి నీలి మేఘాలు కమనీయం.. రమణీయం. ఇక్కడి ప్రకృతి అందాలు కళ్లను మైమరపిస్తాయి. కనివిందు చేస్తుంటాయి. ఒంపు సొంపులతో తిరిగే ఘాట్‌ రోడ్డు ప్రయాణం.. అదరహో అనిపిస్తుంటుంది. అందుకే ఈ ఏడాది అడలి వ్యూ పాయింట్‌కు పర్యాటకులు భారీగా క్యూ కడుతున్నారు. సీతంపేట నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో అడలి వ్యూపాయింట్‌. ఇక్కడికి వెళ్లే మార్గంలో ఎత్తయిన కొండలు, మలుపులు తిరిగే ఘాట్‌ రోడ్లు, చుట్టూ పచ్చని పొలాలు దర్శనమిస్తుంటాయి. అడలికి ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తుంటే ఒకవైపు పర్వత లోయలు, మరోవైపు మనకన్నా ముందుగా వెళ్లే నీలి మేఘాలు తారసపడతాయి. మేఘాలను తాక్కుతున్న కొండల్లో ప్రయాణిస్తుంటే, స్వచ్ఛమైన గాలి మన గుండెకి తాకుతుంటే శరీరంపై రోమాలు నిక్క బొడుచుకుంటాయి. ఉదయాన్నే ఏడు గంటలకు అడలి చేరితే.. ఇక పర్యాటకులకు అరకు, లంబసింగి, ఊటిలో ఉన్నట్టే. అలా ఉంటుంది అక్కడి వాతావరణం. అక్కడ నీలి మేఘాలు మనపైనే పడుతున్నట్లు అనిపిస్తుంది. మంచు వర్షం పడుతున్నట్లుగా ఉంటుంది. మేఘాలు చుట్టూ కమ్మేసి నెమ్మదిగా నడుస్తున్నట్లుగా ఉంటాయి. మరోవైపు విపరీతమైన గాలితో మన శరీరంపై పడుతుంటే అది చెప్పలేని అనుభూతి. వేరే లోకంలో ఉన్న అనుభూతి కలుగజేస్తుంది. అక్కడనుండి చూస్తుంటే వంశధార రిజర్వాయర్‌, కనుచూపుమేరలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం ఆలయం కనిపిస్తుంటాయి.రూ.60 లక్షలతో అభివృద్ధిఅడలి వ్యూ పాయింట్‌ కోసం ఐటిడిఎ సుమారు రూ.60 లక్షల వరకు ఖర్చు చేసింది. రాజుల కోట మాదిరిగా రాతికట్టుతో ఎత్తయిన గోడను నిర్మించారు. వ్యూ పాయింట్‌ కూడా అందంగా తీర్చిదిద్దారు. సాయంత్రం నాలుగు గంటలకు అడలి వ్యూ పాయింట్‌కు చేరుకొని అక్కడ అందరూ చూడటానికి, రాత్రి బస చేయడానికి టెంట్‌ హౌస్‌ను ఇప్పటికే ఐటిడిఎ అధికారులు ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఫలహారాల శాల, రాత్రి స్టే చేయడానికి టెంట్‌ హౌస్‌, తాగునీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా నలుమూలల నిండే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు.

➡️