అదనపు పనిభారం ఆపాలి

Apr 1,2024 21:13

బెలగాం : ఆశా, కమ్యూనిటీ హెల్త్‌వర్కర్లచే సంబంధం లేని అదనపు పనులను చేయించడం వెంటనే ఆపాలని, వారి పోరాటంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక గిరిజన సామాజిక భవనంలో జరిగిన జిల్లా సదస్సు సదస్సులో ఆమె మాట్లాడారు. జిల్లాలో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు రూ.4వేలు మాత్రమే చెల్లిస్తున్నారని, ఆశాలతో సమానంగా పనిచేస్తున్న వీరికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్పు చేసి వారిలాగే వేతనం, ఇతర సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులకు సేవలం దిస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రోజూ సచివాలయాలు, హెల్త్‌ సెంటర్లకు, పిహెచ్‌సిలకు వర్కర్లు వెళ్లి అక్కడే డ్యూటీలు చేయడం వల్ల తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. అలాగే ఎన్‌హెచ్‌ఎంకి భిన్నంగా ఆశా వర్కర్లతో పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను తొలగించి కార్మికులకు, ఉద్యోగుకు, పేదలకు తీరని ద్రోహం చేస్తున్న బిజెపిని, దానికి మద్దతుగా ఉన్న పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కార్మికులు, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే వామపక్ష పార్టీలు, ఇండియా కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆశాలు, సిహెచ్‌డబ్ల్యులచే అదనపు పనులు చేయించకూడదని ప్రభుత్వం నుంచి సర్కులర్‌ వచ్చినప్పటికీ జిల్లాలో అమలు చేయకుండా తమ ఇష్టానుసారంగా అధికారులు గొడ్డుచాకిరీ చేయించడం సరైందని కాదన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కమిటీతో జాయింట్‌ మీటింగు వేయాలని డిఎంఅండ్‌ హెచ్‌ఒను కోరారు. అలాగే నూతన కమిటీని ఆయనకు పరిచయం చేశారు. యూనియన్‌ నాయకులు ఎం.శివాని, కె.గౌరీశ్వరి అధ్యక్షతన జరిగిన సదస్సులో శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.ఇందిర మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని ఫిబ్రవరి 8న చేపట్టిన ఆందోళనలో భాగంగా జరిపి చర్చల్లో ప్రభుత్వం ఆమోదించిన అంశాలపై వెంటనే జీఒలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యాక్సిన్‌ క్యారియర్లను ఆశాలతో తెప్పించి ఆర్థిక భారం మోస్తున్నారని నెలలో పిహెచ్‌ఇఎల్‌ కి నాలుగైదు సార్లు రావాల్సి ఉంటుందని అన్నారు. ఏజెన్సీలోని ఆశా, సిహెచ్‌డబ్ల్యులను పెట్టి పెట్టి పిహెచ్‌ఎల్‌ కి వస్తున్నారని, ప్రభుత్వం ఈ బాధ్యతలకు పారితోషికం ఇవ్వాలని కోరారు. అనంతరం సమస్యలను డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ జగన్నాధ రావుకు వినతిని ఇచ్చారు. దీనికి ఆయన స్పందించారన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ కు యూనిఫామ్‌ ఇవ్వాలని, గిరిజన ఆశా వర్కర్స్‌ వర్తించే సౌకర్యాలను కూడా కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ కి ఇచ్చేలా బాధ్యత వహించాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే సిఐటియుగా పోరాటానికి సిద్ధమవుతామని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ఆశా వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి బి.సుధారాణి మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా వేతనాలను, యూనిఫామ్‌, ఇతర సౌకర్యాలను ఆశా వర్కర్లు పొందగలిగారని, మరిన్ని డిమాండ్ల పరిష్కారానికి రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోరాటంలో ఆశా వర్కర్లంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్‌ను ఆశా వర్కర్లుగా మార్పు చేసే వరకు కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు, ఆశా వర్కర్లు ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపుని చ్చారు. సదస్సులో యూనియన్‌ నాయకులు మాలతి, అన్న పూర్ణ, పలువురు ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు పాల్గొన్నారు.నూతన కమిటీ ఎన్నికసదస్సు అనంతరం 26 మందితో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నూతన జిల్లా కమిటీ ఏర్పడింది. యూనియన్‌ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎం.శివాని, కె.గౌరీశ్వరి, కోశాధికారిగా కె.బృందావతితో పాటు 15 మంది ఆఫీస్‌ బేరర్స్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

➡️