అర్ధాంతరంగా నిలిచిన ప్రభుత్వ భవనాలు

Mar 31,2024 22:00

వీరఘట్టం :మండలంలోని 24 సచివాలయాలు పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్ల భవనాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వీరఘట్టంలో నాలుగు సచివాలయాలున్నప్పటికీ మూడింటికి భవనాలు, ఒక్కొక్క భవనానికి రూ.40లక్షలతో ఉపాధి హామీ నిధుల ద్వారా పనులు చేపట్టినప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ నాలుగు సచివాలయ ఉద్యోగులు ఒకే చోట ఇరుకైన గదుల్లో విధులు నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో రెండు సచివాలయాలను వేరే చోట అద్దె గృహంలో నిర్వహణ కొనసాగించినప్పటికీ వాటికి అద్దె చెల్లించలేక మళ్లీ వాటిని ఒకే చోటకు తీసుకురావడంతో వివిధ రూపంలో ఫిర్యాదు చేసుకునేందుకు అర్జీదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తహశీల్దార్‌ కార్యాలయం పక్కన రెండు సచివాలయ భవనాలు ఐదేళ్లు అయినప్పటికీ స్లాబ్లికే పరిమితమైంది. చలివేంద్ర గ్రామంలో పునాదులకే పరిమితమైంది. హుస్సేన్‌ పురం, కిమ్మి, కత్తుల కవిటి, బిటివాడ, తదితర గ్రామాల్లో భవనాలు పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. కొన్నిచోట్ల పునాదులు వేసి మరికొన్ని శ్లాబ్లు పూర్తి చేసుకొని ప్లాస్టింగులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో గుత్తేదారులు భవనాల అర్ధాంతరంగా నిలిపివేశారు.

➡️