ఇంకా వెనుకబాటే

Apr 1,2024 21:09

గుమ్మలక్ష్మీపురం :  కురుపాం నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఏళ్ల తరబడి సమస్యలున్నా ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోకపోవడంతో ప్రజలను నిత్యం వేధిస్తున్నాయి. నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో ఎక్కువ శాతం మంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ మండలాల్లో నేటికీ తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు అభివృద్ధికి నోచుకోకపోవడంతో గిరిజనులు నేటికీ వెనుకబాటు జీవనం గడుపుతున్నారు.పరిశ్రమలు లేవు.. ఉపాధి కరువు…ఏజెన్సీ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్ల నుంచి గిరిజనులు కోరుతున్నా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడంలేదు. గతంలో ఏర్పాటు చేసిన చేపల పరిశ్రమ, పట్టు పరిశ్రమ, బనియన్‌ ఫ్యాక్టరీలు గిరిజన యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి. అయితే నిర్వహణా లోపంతో వీటిని మూసివేయడంతో గిరిజన యువతకు ఉపాధి కరువైంది. ఐటిడిఎ అధికారులు స్పందించి గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చింతపండు, జీడి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తే వందలాదిమంది గిరిజన నిరుద్యోగ యువతి , యువకులకు ఉపాధి దొరుకుతుంది.కలగా మిగిలిన క్రీడా మైదానాలుకురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస మండలాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు కలగానే మిగిలిపోయాయి. 20 ఏళ్లు కిందట క్రీడా మైదానాల ఏర్పాటు కోసం అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. గుమ్మ లక్ష్మీపురంలో రూ.రెండు కోట్లతో నిర్మిస్తున్న ఇండోర్‌ స్టేడియం పనులు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో గిరిజన యువతకు క్రీడా శిక్షణ లేకుండా పోయింది.వెంటాడుతున్న ఏనుగుల సమస్యనియోజకవర్గంలో జిఎం వలస, కొమరాడ మండలాల్లో గత 17 ఏళ్లుగా అడవి ఏనుగుల సమస్య వెంటాడుతుంది. ఒడిశా రాష్ట్రం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన అడవి ఏనుగుల గుంపు రైతులు పండించే వరి, మొక్కజొన్న, చెరకు పంటలను నాశనం చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. గ్రామాల్లోకి ఏనుగులు రావడంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఇప్పటివరకు ఏనుగుల దాడిలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు.పడకేసిన సాగునీటి వనరులుఏజెన్సీ ప్రాంతంలో పంట పొలాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్‌ డ్యాములు నిర్వహణా లోపంతో పడకేశాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో సీమలగూడ, కొత్తగూడ, వంగర, కేసర, కేసరగూడ, డుమ్మంగి, జిశివడ, కాకిలి, చాపరాయి గూడ, వబ్బంగి తదితర ప్రాంతాల్లో మైనర్‌ ఇరిగేషన్‌, పిటిజి, ఉపాధిహామీ నిధులతో చెక్‌ డ్యాముల నిర్మాణాలను చేపట్టారు. అయితే నిర్వహణ లోపం కారణంగా అవి శిథిలమయ్యాయి. దీంతో ప్రతి ఏటా గిరిజన రైతులు వర్షాధారంపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. లేదంటే ఆ ఏడాది కరువు తప్పదు.రోడ్డు లేదు… తాగునీరు రాదు…వాడబాయి, ఓండ్రు బంగి, గోరటి, శిఖరపాయి, వామసి, వనకాబడి వంటి ఎత్తయిన కొండలపై గిరిజన గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడం, బోర్లు నిర్మించకపోవడంతో చలములు, గెడ్డవాగులపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు. కలుషిత నీటిని తాగుతున్న గిరిజనులు వ్యాధుల బారిన పడుతున్నారు. రోడ్డు మార్గం లేకపోవడంతో గర్భిణులు, చిన్నారులు, వృద్ధులను డోలీల సాయంతో వైద్యం కోసం తీసుకొస్తున్న సందర్భాలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్నారులకు విద్య అంతంత మాత్రమే. దీంతో డ్రాపౌట్స్‌ సంఖ్య నమోదవుతూనే ఉంటుంది. పక్కా గృహాల నిర్మాణాలు లేకపోవడంతో శిథిలమైన ఇళ్లలోనే తల దాచుకుంటూ జీవనం సాగిస్తున్నారు.చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి కల్పించాలి. జీడి పరిశ్రమ ఏర్పాటు, డుమ్మంగిలో చేపల ఉత్పత్తి కేంద్రం వినియోగంలోకి తీసుకొచ్చి గిరిజనులకు ఉపాధి కల్పించాలి. ముఖ్యంగా గిరిజన నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని వైటిసిలో శిక్షణ ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి.పాలక క్రాంతి కుమార్‌ సర్పంచి డుమ్మంగి.వెనుకబాటు జీవితం…కొండ శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో నేటికీ గిరిజనులు వెనుకబాటు జీవనం గడుపుతున్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక వసతులు మెరుగుపడలేదు. అధికా రులు స్పందించి రహదారి నిర్మాణా లకు ప్రాధాన్యత ఇవ్వాలి. మౌలిక వసతులు అందుబాటులోకి తేవాలి.మండంగి రమణ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా, కోశాధికారి గిరిజనుల పట్ల చిన్నచూపుప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజనుల పట్ల చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. గిరిజనాభివృద్ధి, సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. కోలక అవినాష్‌, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి.

➡️