గిరిజన గ్రామాలకు పక్కా రోడ్ల సౌకర్యమే లక్ష్యం

Feb 12,2024 21:43

పాచిపెంట: గిరిజన గ్రామాలకు పక్కా రహదారులు లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. మండలంలోని వేటగానివలస నుండి తంగ్లాం వరకు గల రహదారి నిర్మాణానికి శంఖుస్థాపన, వేటగానివలస నుంచి శతాబి మీదుగా అరకు రహదారిని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గిరిజన గ్రామాలను బాహ్య ప్రపంచంతో అనుసంధానించేందుకు రహదారుల ఆవశ్యకత ఉందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో రహదారులు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఉండడం వల్ల ప్రజలు ప్రయోజనం పొందుతారని అన్నారు. సిఎంకు గిరిజనుల పట్ల ఎంతో అభిమానం ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం దిశగా పనిచేస్తూ ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం రహదారి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గిరిజనులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ప్రగతి పథంలో నడవాలని పిలుపునిచ్చారు. జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఎంవిఆర్‌ కృష్ణాజీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, మండల వైసిపి అధ్యక్షులు గొట్టాపు ముత్యాల నాయుడు, వైస్‌ ఎంపిపి ఎం.నారాయణరావు, టిడిపి నాయకులు డి.బాబ్జీ, పలువురు ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.

➡️