టెన్త్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Feb 12,2024 21:44

 పార్వతీపురంరూరల్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి పరీక్షలు పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవనాయుడు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సోమవారం కలెక్టరు కార్యాలయంలో సంబందిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణలో భాగమైన వివిధ శాఖలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై డిఆర్‌ఒ సమీక్షించారు. పరీక్షల నిర్వహణలో ఆయా శాఖలకు కేటాయించిన పనుల ఏర్పాట్లు పూర్తిచేయాల న్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు బస్సు సౌకర్యంలేని గ్రామాల నుండి ప్రత్యేక బస్సులు నడపాలని ప్రజా రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. రైల్వే గేట్లు గల గ్రామాల నుంచి విద్యార్థులు ముందుగా బయలుదేరేలా చూడాలని తెలిపారు. పరీక్షలు జరుగు రోజుల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీరు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మందులు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షను అమలు చేయాలని, ఎస్కార్ట్‌, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణ, తనిఖీ చేసేందుకు సిట్టింగు, ఫ్లయింగు స్క్యాడ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షల నిర్వహణ అనంతరం జవాబు పత్రాల బండిల్స్‌ సకాలంలో పంపేందుకు పరీక్షల నిర్వహణ అధికారులకు పోస్టలు సిబ్బంది సహకరించాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షల ఏర్పాట్ల గూర్చి తెలియజేస్తూ జిల్లాలో 217 పాఠశాలలకు చెందిన 11,198 మంది విద్యార్థులు టెన్త్‌ పదవతరగతి పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. వీరిలో 10534 మంది విద్యార్థులు రెగ్యులర్‌ గాను, 664 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరవుతున్నార న్నారు. జిల్లాలో 66 పరీక్షా కేంద్రాలు, 600 మంది ఇన్విజిలేటర్లు, మూడు ఫ్లయింగ్‌ స్కాడ్లను నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇన్‌ఛార్జి డిఇఒ ఎంఇ రేణుజ్యోతి, డిఎం టివిఎస్‌సుధాకర్‌, ఆర్‌టిఒ సి.మల్లిఖార్జున రెడ్డి , కలెక్టరేట్‌ సూపరింటెండెంటు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️