ఠారెత్తిస్తున్న ఎండలు

Apr 2,2024 22:17

పార్వతీపురంరూరల్‌ : గత వారంరోజులుగా తన ప్రతాపం చూపిస్తున్న భానుడు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ నిప్పులు కురిపించాడు. అందుకు నిదర్శనం మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలను చూస్తే అర్ధమౌతుందు. సాలూరులో అత్యధికంగా43.1 డిగ్రీలు నమోదు కాగా, కురుపాం 41,6, గుమ్మలక్ష్మీ పురం41.6, సీతానగరం 40.2, పార్వతీపురం 40, భామిని 4 1.6, పాలకొండ41.6, జియ్యమ్మవలస 41.6, పాచిపెంట 40.2, మక్కువ 40.9, సీతంపేట 40, బలిజిపేట 40.9, కొమరాడ 38.7, వీరఘట్టం 41.6, గరుగుబిల్లి 39.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 7గంటల నుంచే వాతావరణం వేడెక్కడంతో ఉపాధిహామీ కూలీలు పనులు సక్రమంగా నిర్వహించలేక పోతున్నారు. రానున్న రోజుల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ, విపత్తుల నివారణ శాఖకు చెందిన అధికారులు హెచ్చరిస్తున్నందు వల్ల ప్రజలు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్‌ పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఉదయం 10గంటల తర్వాత బయటకు రాకూడదని, వచ్చినా నూలు దుస్తులు ధరించడం, శీతలపానీయాలు సేవించడంతో పాటు తప్పనిసరిగా తలకు టోపీలు ధ రించాలని జిల్లా కేంద్ర అసుపత్రి సూపరిండెంట్‌ డా. వాగ్దేవి సూచిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం : జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం అత్యధికంగా 41 డిగ్రీలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ ప్రారంభంలో మండే ఎండలతో వేసవి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌లో విపరీతమైన వేడి గాలులు ఉంటాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎండల ప్రభావం అధికంగా ఉండడంతో ప్రజలు ఇంటి నుంచి రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్న సమయాల్లో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు కళ్లకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల ప్రభావం వృద్ధులు గర్భిణీలు చిన్నారులపై ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి పానీయాలు తీసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, గొడుగు, తెల్లటి దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

➡️