దళితవాడలో అన్నీ సమస్యలే..!

Feb 11,2024 21:24

వీరఘట్టం : దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పని చేస్తుందని పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారు తప్ప తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు దళితులు ఆరోపిస్తున్నారు. స్వాతంత్య్ర వచ్చి 75ఏళ్లు పూర్తయినప్పటికీ దళిత వాడల్లో సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయంటే పాలకుల పనితీరు ఏ విధంగా ఉందో వీటిని చూస్తూనే అర్థం చేసుకోవచ్చు. మండలంలోని రేగులపాడు సచివాలయ పరిధిలోని బొడ్లపాడు ఉంది. ఈ గ్రామంలో సుమారు 75 కుటుంబాలకు చెందిన దాదాపుగా 300 మంది దళితులు నివాసం ఉంటున్నారు. ఈ దళితవాడలో ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కరించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశానానికి రహదారి సౌకర్యం లేక అవస్థలుతమ వీధిలో ఏ ఒక్కరు మృతి చెందినా శ్మశాన వాటికకు తరలించేందుకు కనీసం రహదారి సౌకర్యం లేకపోవడంతో మృతదేహాలను తీసుకువెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నామని దళితులు చెబుతున్నారు. వర్షాకాలంలో మృతదేహాలను తీసుకెళ్లేందుకు బురదలో నుంచి పంటలను తొక్కుకొని శ్మశానవాటికకు మృతదేహాలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దళితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దళితులకు కేటాయించిన శ్మశాన వాటిక క్రమేపీ కబ్జాకు గురవుతుంది. శ్మశాన వాటిక చుట్టుపక్కల ఉన్న పెత్తందారులు ప్రతిఏటా కుదించుకుపోతున్నారని, ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో శ్మశాన వాటిక కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మనిషి మృతదేహం పూడ్చాల్సిన పరిస్థితి దాపురుస్తుందని దళితులు ఆరోపిస్తున్నారు. దళితుల కోసం ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటిక ఇప్పటికే కనుమరుగైపోతుందని దళితులు ఆరోపిస్తున్నారు.విద్యుత్‌ సౌకర్యం కోసం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదుగ్రామంలో మూడు దళిత వీధుల్లో పది విద్యుత్‌ స్తంభాలున్నాయని,అదనంగా మరో నాలుగు స్తంభాలు ఏర్పాటు చేయాలని పాలకులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని దళితులు ఆరోపిస్తున్నారు. స్తంభాలు ఉన్నప్పటికీ వీధి దీపాలు రెండు నెలల నుంచి వెలగడంలేదని, గృహాలు, పంట పొలాలకు దగ్గరగా ఉన్నందున విష సర్పాలు గృహాల్లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పంచాయతీ పాలకవర్గానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాలువల్లేక అవస్థలుదళితవాడలో సిసి రహదారులు నిర్మించినప్పటికీ గృహాలకు ఇరువైపులా కాలువలు లేకపోవడంతో వర్షాకాల సమయంలో వర్షపు నీరంతా రోడ్డుపై నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నామని దళితులు చెబుతున్నారు. అలాగే ఒక వీధిలో కాలువ ఉన్నప్పటికీ గత కొంతకాలంగా ఆ కాలువలో చెత్తాచెదారాలు పేరుకుపోయి రోడ్డుపైకి మురికినీరు వస్తుందని తెలిపారు. లీకులు అరికట్టించేందుకు చర్యలు తీసుకోవాలిగ్రామానికి వండవ ఉపరితల రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నప్పటికీ పొన్నాడ వాసుదేవరావు ఇంటి వద్ద పైప్‌లైన్‌ లీక్‌ కావడంతో తాగునీరు వృథాగా పోవడంతో రోడ్డంతా బురదమయంగా మారింది. దీంతో తాగునీరు అరకొరగా అందడంతో అవస్థలు పడుతున్నట్లు దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలోనూ, వీరఘట్టంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకవర్గం స్పందించి దళితవాడలో సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని దళితులు కోరుతున్నారు.

➡️