పింఛనుల్లేవి మంత్రి గారూ?

Apr 1,2024 21:15

సాలూరు : ఒకటో తేదీ వచ్చింది… పింఛన్లు ఏవీ మంత్రి గారూ అని వృద్ధ మహిళలు డిప్యూటీ సిఎం రాజన్నదొరను ప్రశ్నించారు. పట్టణంలోని 12వ వార్డు కర్రివీధి, గాడి వీధుల్లో శనివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్రివీధిలో చింత పిక్క తీత కార్మికులైన వృద్ధ మహిళల వద్దకు రాజన్నదొర వెళ్లారు. రానున్న ఎన్నికల్లో వైసిపిని మళ్లీ గెలిపించాలని, తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రతి నెలా ఒకటో తేదీకి పింఛన్లు పంపిణీ చేసేవారని, ఇప్పుడెందుకు ఇవ్వలేదని వృద్ధమహిళలు ప్రశ్నించారు. దీనిపై రాజన్నదొర మాట్లాడుతూ నెలనెలా ఒకటో తేదీకి పింఛన్లు అందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదు చేశారని, అందుకే ఎన్నికల సంఘం వాలంటీర్లను విధుల నుంచి తప్పించిందని చెప్పారు. వృద్దులు, వికలాంగులు ఇబ్బందులకు గురి కావడానికి కారణం టిడిపి, జనసేన పార్టీలేనని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు అంటే మూడు నెలల పాటు పింఛను దారులకు ఇబ్బందులు తప్పవని చెప్పారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై టిడిపి, జనసేన పార్టీలు మొదటి నుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఈ పార్టీ నాయకుల తీరుపై ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. టిడిపి కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందవని రాజన్నదొర చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షులు జర్జాపు ఈశ్వరరావు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు పప్పల లక్ష్మణరావు గొర్లి వెంకటరమణ, వైసిపి నాయకులు ముసిడిపిల్లి కృష్ణ, జాగారపు రమేష్‌, పతివాడ శివ, యర్రా దాలినాయుడు, కొల్లి వెంకటరమణ, లింగాల సింహాచలం పాల్గొన్నారు.

➡️