బిజెపిని ఓడించాలి

Apr 1,2024 21:11

బలిజిపేట:  దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని, మతసామరస్య ఐక్యతను దెబ్బతీస్తున్న బిజెపిని ఓడించాలని, ఆ పార్టీకి మద్దతు పలుకుతున్న వైసిపి, టిడిపి, జనసేనకు బుద్ధి చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం నాయకులు బొద్దాన భానుమూర్తి అధ్యక్షతన సోమవారం సిపిఎం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేణు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతఘర్షణలు, ప్రాంతీయ వైషమ్యాలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ఫెడరలిజాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ దాని మత అజెండాను ముందుకు తెచ్చి దేశ ఐక్యతను నాశనం చేస్తుందని విమర్శించారు. కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేస్తూ, ప్రశ్నించిన వారిపై ఇడి, సిబిఐ స్వతంత్ర సంస్థలను తన జేబు సంస్థలుగా మలుచుకొని దాడి చేస్తుందన్నారు. తద్వారా ఎలక్ట్రికల్‌ బాండ్ల ద్వారా వేలకోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందని, అవినీతిపరులను వెనకేసుకొస్తూ దేశాన్ని లూటీ చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ సమస్యను, నిత్యవసర వస్తువు ధరలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గలేదడంలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్‌ప్లాంట్లు, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఫోర్స్‌, రైల్వే అన్ని రంగాలను కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగపరమైన హక్కుల్లేకుండా చేస్తుందని, ఇటువంటి బిజెపికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే మన రాష్ట్రంలో బిజెపికి వంత పాడుతున్న టిడిపి, జనసేన, వైసిపికి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, విభజన చట్టం హామీలు, రైల్వే జోను, విశ్వవిద్యాలయాలు, మెడికల్‌ కాలేజీలు, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ స్పెషల్‌ ప్యాకేజీ, రాజధాని నిధులు, పోలవరం నిధులు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, అటువంటి బిజెపికి రెడ్‌ కార్పెట్‌ వేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వైసిపి, టిడిపి, జనసేన మోసగిస్తున్నాయని విమర్శించారు. అందుకనే దేశ ఐక్యత, లౌకిక తత్వాన్ని, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని, కావున అరకు పార్లమెంట్లో ఇండియా కూటమి తరుపున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థిని బలపరచాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు యమ్మల మన్మధరావు, నాయకులు ఆవు సాంబమూర్తి, పీసా వెంకటస్వామి, బలరామ నాయుడు, నల్ల ఈశ్వరరావు, దన్నాన సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️