శంఖారావ సభను విజయవంతం చేద్దాం: కిడారి

Feb 11,2024 21:23

పాలకొండ:ఈ నెల 13న పాలకొండ నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో జరిగే శంఖారావం సభ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అరకు పార్లమెంట్‌ అధ్యక్షులు, మాజీమంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం శంఖారావ సభ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణానికి, భవిష్యత్‌ కోసం చేపట్టే శంఖారావ సభ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వైసిపి ప్రభుత్వంలో నిరుద్యోగులకు, రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు మోసం జరిగిందని, వైసిపి ప్రభుత్వానికి ప్రజల సొమ్ము దోచుకోవడం తప్ప సంపద సృష్టించే ఆలోచన లేదని విమర్శించారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నారని అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అధ్యక్షతన మంగళవారం పాలకొండలో జరిగే శంఖారావం సభకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు గొట్టిముక్కల కోటేశ్వరరావు, సీనియర్‌ నాయకులు కిమిడి కాశింనాయుడు, పాలవలస కన్నబాబు, జి.గౌరీనాయుడు, శంకరాపు భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.కురుపాం : కురుపాం నియోజకవర్గంలో ఈనెల 13న జరిగే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శంఖారావం సభ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అరకు పార్లమెంట్‌ అధ్యక్షులు కిడారి శ్రావణ్‌ కుమార్‌ పిలుపు ఇచ్చారు. ఆదివారం శంఖారావం జరుగు సభ స్థలాన్ని పరిశీలించిన అనంతరం చినమేరంగి కోట వద్ద నియోజకవర్గ టిడిపి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. ఈ నేపథ్యంలో జరుగనున్న సభను జయప్రదం చేయాలని కోరారు.కార్యక్రమంలో నియోజక వర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌చంద్రదేవ్‌, రాష్ట్ర బిసి సెల్‌ కార్య నిర్వాహక కార్యదర్శి డొంకాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీరఘట్టం : పాలకొండ మండలంలోని రాజుపేట గ్రామ సమీపంలో ఈనెల 13న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మండల అధ్యక్షులు ఉదయాన ఉదయ భాస్కర్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఆటో ద్వారా ప్రచార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

➡️