13న రైతు సమస్యలపై నిరసన

Dec 11,2024 21:31

ప్రజాశక్తి-సాలూరు: ఈ నెల 13న రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ డిప్యూటీ సిఎం రాజన్నదొర చెప్పారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చకుండా మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. బడులు ప్రారంభించి ఆర్నెల్లు అయినా తల్లికి వందనం కింద రూ.15 వేలు చెల్లించలేదని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌, వసతి దీవెన కూడా ఇవ్వలేదన్నారు. నెలకు రూ.1500 చొప్పున ప్రతి మహిళకు ఇస్తానన్న నగదు పంపిణీ చేయలేదని చెప్పారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేల భృతి కూడా లేదన్నారు. ఇక మొదటి సంతకమని చెప్పిన మెగా డిఎస్‌సితో ఇంకా ప్రభుత్వం దోబూచులాడుతోందని దుయ్యబట్టారు. 20 లక్షల ఉద్యోగాలంటూ ఆశపెట్టి యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబ్‌ కేలండర్‌ ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. వీటితో పాటుగా పాత పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అవి ఎక్కడున్నాయో తెలియదని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి, ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి, రబీ ప్రారంభమైనా ఒక్క రైతుకీ నయా పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ మోసాలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు రాజన్నదొర చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ఎంపిటిసి సభ్యులు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, కౌన్సిలర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు.గుమ్మలక్ష్మీపురం : ఈ నెల 13న జిల్లా కలెక్టరేట్‌కు రైతులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మాజీ డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను జియ్యమ్మవలస మండలం చినమేరంగి కోటలో బుధవారం ఆవిష్కరించారు. రైతుల సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు పాల్గొని, విజయవంతం చేయాలని ఆమె కోరారు.

➡️