కొమరాడ : గిరిజనులకు రక్షణ కవచంలా ఉండే 1/70 చట్టం జోలికొస్తే ఖబడ్దార్ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజనులు హెచ్చరించారు. 1/70చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని, గిరిజన ప్రజలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మధు కైలాస్ డిమాండ్ చేశారు. మండలంలోని పెద్దశాఖలో శుక్రవారం రాత్రి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మధు కైలాస్, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ 1/70 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఇటీవల విశాఖలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగించేలా ఉన్నాయని అన్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీలు 5వ షెడ్యూలు కిందకు వస్తుందని తెలిపారు. దీన్ని ధిóక్కరించే అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వీటిని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు 1/70ను సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని, ఏజెన్సీలో లభించే సహజ వనరులు బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు దీన్ని మరింత బలపరుస్తున్నాయన్నారు. ఈ చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చిందన్నారు. ఇప్పటికే అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన ప్రాంతాలు 1/70ను సవరిస్తే మరింత వెనుకబడిపోతాయని, తక్షణం ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు గిరిజన యువకులు పాల్గొన్నారు.కురుపాం : ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవ డిమాండ్ చేశారు. మండలంలోని ఏగులువాడ పంచాయతీ పొరడంగూడలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.లింగరాజు ఆధ్వర్యంలో గిరిజనులతో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ లో గిరిజనులు అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించడాన్ని సిపిఐ, గిరిజనులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకగ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, జిల్లా సమితి సభ్యులు పువ్వుల ప్రసాదు, మండింగి సింగన్న, మోహనరావు, పత్తు తదితరులు పాల్గొన్నారు.
