ప్రజాశక్తి – పార్వతీపురం : ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ (పిఎం జుగా) కార్యక్రమాన్ని అక్టోబర్ 2న ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పిఎం జుగా, పిఎం జన్‌మన్ (ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) కార్యక్రమాల కొనసాగింపు ఏర్పాట్లపై శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 2న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం ఐటిడిఎ ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పిఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ కార్డులు నమోదు, పిఎం ఉజ్వల్ ఉచిత గ్యాస్, ఆధార్ కార్డుల నమోదు, జల్ జీవన్ మిషన్లో ఇంటింటికి కుళాయిలు, పివిటిజి గ్రామాల్లో రహదారులు వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని వివరించే స్టాళ్లను అన్ని విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, కేంద్ర ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపాశారు. అనంతరం పిఎం జుగా వేదికను కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో ఐటిడిఎ పిఒ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్‌డిఎ, డ్వామా పీడీలు వై.సత్యంనాయుడు, కె.రామచంద్రరావు, జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకరరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.రవి, జిల్లా పశుసంవర్ధక అధికారి ఎస్.మన్మథ రావు, డిఇఒ జి.పగడాలమ్మ, జిల్లా మత్స్య శాఖ అధికారి వి. తిరుపతయ్య, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె.రాజ్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.