ప్రజాశక్తి – సీతానగరం : ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)కు చెందిన 7700 కిలోల బియ్యం అక్రమ రవాణా జరుగుతుండగా పట్టుకున్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ బి.సింహాచలం తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రీజనల్ అధికారి బి.ప్రసాదరావుకు అందిన సమాచారం మేరకు సోమవారం తమతో పాటు సీతానగరం రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించామన్నారు. బొబ్బిలి నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా కాశీపేట-సీతానగరం మధ్య బొలెరో పికప్ వాహనంలో 52 బస్తాలు 2600కేజీలు, అశోక్‌లైలాండ్‌లో 53బస్తాలు 2650 కేజీలు, మరో బొలెరో వాహనంలో 49 బస్తాలు 2450కేజీలు వెరసి 154 బస్తాలు 7700 కిలోల బియ్యం అక్రమ రవాణాను గుర్తించామన్నారు. ఈ బియ్యం విలువ సుమారు రూ.3,50,350గా అంచనా వేశామన్నారు. ప్రజా పంపిణీకి చెందిన బియ్యాన్ని అక్రమంగా బొబ్బిలి మండలం పిరిడి, కమ్మవలస గ్రామాలకు చెందిన రేపాక శ్రీనివాసరావు, భోగిరాల శ్రీనివాసరావు, కేతల ధనుంజయరావు రవాణా చేస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. యజమానులను పిడిఎస్ బియ్యం గుర్తించి ప్రశ్నించగా, చుట్టుపక్కల గ్రామాల్లో పిడిఎస్ బియ్యం కిలో రూ.18లకు కొనుగోలు చేసి వాటిని ఒడిశాలో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిపారని చెప్పారు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ ఉంచడం, అమ్మడం నేరమని పేర్కొంటూ సదరు వ్యక్తులైన, వాటి వాహన డ్రైవర్లు, యజమానులపై సెక్షన్ -6ఎ, 7(1) కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు లక్ష్మీనారాయణ, శేషగిరి, సిఎస్‌డిటి ఎన్.రమేష్‌బాబు, విఆర్‌ఒలు ఎస్.లక్ష్మి, జి.నాగమణి, ఎం.సింహాచలం, కుమారస్వామి పాల్గొన్నారు.
